Manipur: మైతీ ఉగ్రవాదుల వద్ద స్టార్‌లింక్ డివైజ్..

Manipur: మైతీ ఉగ్రవాదుల వద్ద స్టార్‌లింక్ డివైజ్..
X
దేశభద్రతకు ముప్పుగా మస్క్ టెక్నాలజీ!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మైతీ ఉగ్రవాదుల వద్ద ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ స్టార్‌లింక్‌కు చెందిన డిష్, రూటర్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దాడులు, ముఖ్యమైన సమాచార మార్పిడి కోసం వేర్పాటువాద గ్రూప్‌లు ఇంటర్నెట్ సేవలను వినియోగించకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది మే నుంచి జాతుల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇటీవల మరోసారి హింస చెలరేగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ వినియోగానికి అనుమతి లేకపోయినా.. ఆ డివైజ్ సాయంతో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగించడంపై విస్మయానికి గురిచేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబరు 13న తూర్పు ఇంఫాల్ జిల్లాలోని ఖునౌ వద్ద భద్రతా బలగాలు, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో స్టార్‌లింక్‌ డిష్, రూటర్‌తో పాటు ఎంఏ4 అసల్ట్ రైఫిల్స్, గ్రనేడ్లు, బుల్లెట్లు లభ్యమయ్యాయి.

మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ఉద్దేశంతో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. భూకక్ష్య దిగువన పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి.. అనుసంధానం చేసింది. అయితే, ఈ సేవలు భారత్‌లో అందుబాటులోకి రాలేదు. అనుమతి కోసం మస్క్ కంపెనీ దరఖాస్తు చేసింది. ఇక, మణిపూర్‌లో స్టార్‌లింక్ డివైజ్ లభ్యమైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు. ‘ఇది తప్పుడు ప్రచారమని.. భారత్‌ మీదుగా శాటిలైట్ బీమ్స్ పనిచేయడం లేదు’ అని తెలిపారు.

కాగా, మణిపూర్‌లో పట్టుబడిన డివైజ్, ఆయుధాలకు సంబంధించిన ఫోటోలను ఆర్మీ స్పియర్ కార్ప్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆర్మీ, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపింది. చుర్‌చందాపూర్, చందేల్, ఇంఫాల్ ఈస్ట్, కంగ్‌పోక్పిలో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లో స్టార్‌లింక్ లోగోతో ఉన్న డిష్, రూటర్‌లు ఉన్నాయి. నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టామని చెప్పింది. స్పైపర్స్, ఆటోమేటిక్ ఆయుధాలు, రైఫిల్స్, పిస్టోల్స్, మోర్టార్లు, సింగిల్ బారెల్ రైఫిల్స్, గ్రనేడ్లు పేలుడు పదార్థాలతో కూడిన పెద్ద పెద్ద డంప్‌లు గుర్తించామని వివరించింది.

కేంద్ర హోం శాఖ నిషేధించిన ఎనిమిది మైతీ వేర్పాటువాద గ్రూప్‌లో ఒకటైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ‌కి చెందిన రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్‌ స్థావరంలో ఈ ఆయుధాలు లభ్యమయ్యాయి. మణిపూర్‌లో లభ్యమైంది నవంబరు 2021లో స్టార్‌లింక్ అందుబాటులోకి తీసుకొచ్చిన డిష్‌గా గుర్తించారు. మణిపూర్ పొరుగున ఉండే మాయన్మార్‌లోనూ స్టార్‌లింక్‌ అధికారికంగా సేవలకు అనుమతిలేదు. అయినప్పటికీ, మయన్మార్ డిజిటల్ స్పేస్‌లో పరిణామాలను ట్రాక్ చేసే.. మయన్మార్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్- 2022 దేశవ్యాప్తంగా దాదాపు 3,000 స్టార్‌లింక్ కనెక్షన్‌లను గుర్తించింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్, మారుమూల ప్రాంతాలలో నివసించే సాధారణ ప్రజలు ఉపయోగించినట్టు నిర్దారణకు వచ్చింది.

Tags

Next Story