Sedition law: దేశ ద్రోహ చట్టం ఉండాల్సిందే: లా కమిషన్

దేశ ద్రోహ చట్టం అమలుపై లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సమగ్రతను, ఐక్యతన కాపాడేందుకు దేశ ద్రోహ చట్టం చాలా అవసరమని.. జస్టిస్ రితురాజ్ అవస్తీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశద్రోహ చట్టం చాలా అవసరమన్న ఆయన ఈ చట్టం ప్రయోగాన్ని తాము చాలా క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని వెల్లడించారు. కశ్మీర్ నుంచి కేరళ వరకు పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే దేశ సమగ్రత కాపాడేందుకు దేశ ద్రోహ చట్టం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశద్రోహం చట్టాన్ని అమలు చేసే IPC సెక్షన్ 124Aని కొన్ని సవరణలతో భారత శిక్షాస్మృతిలో కొనసాగించాలని... న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో లా కమిషన్ సిఫారసు చేసింది. ఈ సవరణలు దేశ ద్రోహ చట్టం అమలుపై మరింత స్పష్టత ఇస్తాయని జస్టిస్ అవస్తీ వెల్లడించారు. సెక్షన్ 124 A దేశ ద్రోహ చట్టం దుర్వినియోగానికి సంబంధించిన అభిప్రాయాలను తెలుసుకుని... దానిని అరికట్టే మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. దేశద్రోహ చట్టం, భారత్‌లో దాని వినియోగంపై తాము సమగ్ర అధ్యయనం చేశామని 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి వెల్లడించారు. ఈ అధ్యయనం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఒక సూచనను స్వీకరించినట్లు లా కమిషన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
గత ఏడాది మేలో అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. సుప్రీంకోర్టు దేశద్రోహ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ.. దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ ‘124ఏ’ను సమీక్ష చేయాలని ఆదేశించింది. ఈ నేరారోపణతో జైళ్లలో మగ్గుతున్న వారికి ఊరటను కల్పించింది. రాజద్రోహ చట్ట రాజ్యాంగబద్ధత అంశం ప్రభుత్వ పునఃపరిశీలనలో ఉన్నందున దీని కింద కొత్తగా కేసులు నమోదు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 124ఏ కింద నమోదైన అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌నూ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఎవరిపైనైనా ఈ సెక్షన్‌తో పాటు, ఇతర సెక్షన్ల కిందా కేసులు నమోదు చేసి ఉంటే మిగిలిన సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com