Bengaluru: బెంగళూరును వణికిస్తున్న వర్షం
దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్న వరుణుడు వణికిస్తున్నాడు. సోమవారం నుంచి అకస్మాత్తుగా మొదలైన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వరద తాకిడికి యలహంక కేంద్రీయ విహార్ ఆవరణలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. కింది అంతస్తుల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యేలోపే వరద చుట్టుముట్టింది. ఆ ప్రాంతంలోని నివాసితులను మంగళవారం ఉదయం నుంచి యుద్ధప్రాతిపదికన బయటకు తీసుకొచ్చారు. నగరంలోని కీలక ప్రాంతమైన బాబూసాపాళ్యలో నిర్మాణంలో ఉన్న భవంతి మంగళవారం సాయంత్రం వర్షాల వల్ల ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.ఇక, యశ్వంతపురలో సోమవారం సాయంత్రం నీళ్లు తెచ్చేందుకు కెంగేరి చెరువులో దిగిన మహాలక్ష్మీ(11) అనే బాలిక మునిగిపోతుండగా.. దీనిని గుర్తించిన ఆమె సోదరుడు శ్రీనివాస్ అలియాస్ జాన్సీ(13) కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ఇద్దరూ చెరువులో మునిగి మృతి చెందారు. బాలుడు మృత దేహాన్ని వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది.. బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.
భారీవర్షం నేపథ్యంలో నగరంలోని విద్యాసంస్థలకు అధికార యంత్రాంగం బుధవారం సెలవు ప్రకటించింది. బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్డు, మహదేవపుర, ఇబ్లూరు, మారతహళ్లి తదితర ప్రాంతాల్లోనూ సర్వీసు రోడ్లలో బైకులపై ప్రయాణించవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పలు సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరాయి. అండర్ టన్నెళ్లలో నిలిచిన నీటిని తొలగించేందుకు మున్సిపల్, బెస్కాం, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ దళం ప్రయత్నాలు ప్రారంభించారు.
రెండు రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు పలు చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. ఆ మార్గాల్లో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వర్షం కురుస్తున్న సమయంలో హఠాత్తుగా సర్వీసు రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. ఇక, ఈ నెల 1 నుంచి 22 వరకు నగరంలో 241 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. గత 124 ఏళ్లలో ఇదే నాలుగో అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. గతంలో 1943, 1970, 2005 తాజాగా ఇప్పుడే అధిక వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు వారాలుగా నగరంలో పలు చోట్ల 150 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఐటీ కారిడార్లలో ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com