Seven Police Sisters: పోలీసులైన సెవెన్​ సిస్టర్స్

Seven Police Sisters: పోలీసులైన సెవెన్​ సిస్టర్స్
ఎంతో కష్టపడి చదివి​- ఇప్పుడు మంచి పొజిషన్​లో సెటిలై

ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు బిహార్​ పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సంపాదించారు. దీంతో ఈ 'సెవెన్​ సిస్టర్స్​' పేర్లతో పాటు వారిని ఈ స్థాయికి తీసుకువచ్చిన వీరి తండ్రి పేరు కూడా ప్రస్తుతం మారుమోగుతోంది. వీరంతా బిహార్​లోని ఛప్రా జిల్లా వాసులు. జిల్లాకు చెందిన కమల్​ సింగ్​కు 8మంది కూతుళ్లు, ఒక కుమారుడు. వీరిలో అనారోగ్య కారణంతో ఒక కుమార్తె చిన్నప్పుడే మృతి చెందింది. దీంతో మిగతావారిని ఎంతో కష్టపడి చదవించాడు.

కమల్​ సింగ్​కు ఒకరి తర్వాత ఒకరు ఆడపిల్లలే పుడుతూ ఉండడం వల్ల ఆయన్ను అనేక విధాలుగా మాటలతో మానసిక వేదనకు గురిచేశారు ఇరుగుపొరుగువారు. ఒకానొక సమయంలో ఆయన తన పూర్వీకుల సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కమల్​ సింగ్​ సరన్​ జిల్లాలోని నాచాప్​ గ్రామంలోని తన ఇంటిని ఖాళీ చేసి చప్రాలోని ఎక్మాకు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సాయంతో ఇంటి వద్ద ఓ చిన్నపాటి పిండి గిర్నీని నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు.

అయితే తన ఏడుగురు కుమార్తెలను ఎలా పోషిస్తావు? త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపండని కమల్​ సింగ్​కు ఎంతోమంది సలహాలిచ్చారు. అయినా వాటన్నింటినీ పట్టించుకోకుండా తన కుమార్తెలు ఎక్కడివరకైతే చదవాలనుకున్నారో అక్కడి వరకు చదవించి వారిని ఈరోజు ఈ స్థాయిలో నిలిపారు. ఈయన సహకారానికి తోడు ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు కూడా ధైర్యం, పట్టుదలతో తాము అనుకున్నది సాధించి చూపించారు.


ప్రస్తుతం ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు బిహార్​ పోలీసు శాఖలో, వివిధ కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఒకరు 2006లోనే సశస్త్ర సీమా బల్-ఎస్​ఎస్​బీలో కానిస్టేబుల్​ పోస్టుకు ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరికీ పోలీసు శాఖలో చేరాలనే ఆశ, ధైర్యం వచ్చింది. ఇక వీరిలో రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్​ పోలీస్​ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అలా ఒకరితర్వాత ఒకరు వరుసగా ఇతర ఐదుగురు సోదరీమణులు కూడా ఎక్సైజ్​ శాఖ, సీఆర్​పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ దళాలకు ఎంపికయ్యారు. అయితే ఉద్యోగానికి ఎంపిక అయ్యేందుకు ముందు కావాల్సిన నైపుణ్యాలు, మెలకువలను వీరంతా తమ అక్కల ద్వారా నేర్చుకున్నారు. గ్రామంలోని ఓ పాఠశాలలో చదివిన వీరు పొలంలోనే ఈవెంట్స్​ ప్రాక్టీస్​ చేసేవారు.

ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న తమ తండ్రికి ఆసరాగా ఉండేందుకు కుమార్తెలందరూ కలిసి ఓ గొప్ప బహుమతి ఇచ్చారు. ఛప్రాలోని ఎక్మా బజార్‌లో ఓ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించి బహుకరించారు. దీని ద్వారా నెలకు రూ.18-20 వేల అద్దెను పొందుతున్నారు కమల్​ సింగ్​. ఇక ఆర్థికంగా ప్రస్తుతం తనకేమీ ఇబ్బందుల్లేవని అంటున్నారు కమల్​.

Tags

Next Story