Governor CV Ananda Bose: లైంగిక వేధింపుల కేసులో బెంగాల్‌ గవర్నర్‌

Governor CV Ananda Bose: లైంగిక వేధింపుల కేసులో బెంగాల్‌ గవర్నర్‌
X
ఫిర్యాదు చేసిన రాజ్‌భవన్‌ ఉద్యోగిని

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గవర్నర్‌పై తమకు ఫిర్యాదు అందిందని డీసీ (సెంట్రల్) ఇందిరా ముఖర్జీ గురువారం నాడు పేర్కొన్నారు. అయితే, రాజ్‌భవన్‌లో పని చేస్తున్న ఓ మహిళ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు పేర్కొన్నారు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నాం.. లైంగిక వేధింపులు ఎప్పుడు వెలుగు చూశాయనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ, కంప్లైంట్ ప్రకారం, రాజ్‌భవన్‌లోనే పలు మార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు సదరు మహిళ ఫిర్యాదు చేసిందని డీసీ పేర్కొన్నారు.

కాగా, బెంగాల్ లోని రాజ్‌భవన్‌లో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనలాగే అనేక మంది బాధితులు ఉన్నారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. మహిళల గౌరవమర్యాదలపై మోడీ, అమిత్ షాలకు నిజంగా నమ్మకం ఉంటే వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. అయితే, ఈ ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కొట్టి పారేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు.. తన పరువుకు భంగం కలిగించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలకు నేను భయపడేది లేదు.. నా పరువు తీసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు.. కానీ, బెంగాల్‌లో అవినీతి, హింసపై నా పోరాటాన్ని ఎవరు ఆపలేరని గవర్నర్ బోస్ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై రాజ్‌భవన్ సిబ్బంది ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఆయనపై ఆరోపణలను ఖండిస్తూ వారు సంఘీభావం తెలిపారు.

బెంగాల్‌ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య సంబంధాలు దెబ్బతిని ఉండటం, దానికి తోడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్న సమయంలో ఈ పరిణామాలు బీజేపీకి షాక్‌నిచ్చాయి.

Tags

Next Story