లంచం ఇచ్చిన షారుఖ్‌ఖాన్‌ కూడా నిందితుడే: వాంఖడే

లంచం ఇచ్చిన షారుఖ్‌ఖాన్‌ కూడా నిందితుడే: వాంఖడే
సమీర్ వాంఖడే పిటిషన్ సవరణకు బాంబే హైకోర్టు అనుమతి.... షారుఖ్‌ఖాన్‌ను నిందితుడిగా చేర్చాలన్న సమీర్‌ వాంఖడే

బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న NCB ముంబై విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేకు తన పిటిషన్‌ను సవరించుకునేందుకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌లో అదనపు కారణాలను చేర్చుకునేందుకు కూడా జస్టిస్‌ AS గడ్కరీ, జస్టిస్‌ SG డిగేలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. తన పిటిషన్‌లో లంచం ఇచ్చిన షారుఖ్‌ఖాన్‌ను కూడా ప్రాసిక్యూట్ చేయడం సహా మరిన్ని అదనపు కారణాలను జోడించాల్సి ఉందన్న సమీర్‌ వాంఖడే వాదనలతో బాంబే హైకోర్టు ఏకీభవించింది.


వాంఖడే న్యాయవాదులు, అబద్ పోండా, రిజ్వాన్ మర్చంట్, స్నేహా సనప్ బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ తరపున కులదీప్ పాటిల్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం... వాంఖడే పిటిషన్‌లో సవరణలకు చివరి అవకాశం ఇచ్చింది. అంతకుముందు కూడా పిటిషన్‌ను సవరించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని బెంచ్‌ గుర్తు చేసింది.

ఇప్పటికే సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. షారూఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌పై డ్రగ్స్న్‌కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపింది. ఇందులో రూ.50 లక్షలను సమీర్ స్వీకరించినట్లు కూడా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లలో సీబీఐ ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది. సమీర్‌ వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై కేసు కూడా నమోదు చేసింది. ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు రెయిడ్‌ సమయంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు ముంబై జోనల్‌ చీఫ్‌గా సమీర్‌ వాంఖేడే ఉన్నారు. షారూక్‌ తనయుడు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై ఈయనే తొలుత దర్యాప్తు చేశారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్‌ అండ్‌ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్‌-సెన్సిటివ్‌ పోస్టింగ్‌ మీద చెన్నైకు బదిలీ చేశారు.

ఆర్యన్‌ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్‌ ఏజెన్సీ సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్‌ ఖాన్‌ తనయుడికి సరైన ఆధారాలు లేకపోవడంతో 2022 మేలో క్లీన్‌చిట్‌ లభించింది.

Tags

Read MoreRead Less
Next Story