ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా వారిద్దరూ

ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా వారిద్దరూ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక పదవులలో ప్రఫుల్ పటేల్, సుప్రియ సూలే

పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటన చేసి, కార్యకర్తలు ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ తాజాగా పార్టీ తరపున కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియ శూలే, ప్రఫుల్ పటేల్ లు ఇకపై సేవలు అందించనున్నట్టుగా పేర్కొన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలియజేశారు. గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా శరద్ పవార్ ప్రకటించగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో పవార్ తిరిగి అధ్యక్షుడిగా కొనసాగారు.

అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ లను ఏర్పాటు చేసుకోవాలని పార్టీ ప్యానెల్ సూచించడంతో తాజాగా ఈ నియామకాలు చేపట్టారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియ సూలే ఉంటూనే మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలు చూసుకుంటూ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ప్రఫుల్ పటేల్ కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్, ఝార్ఖండ్ వ్యవహారాలను చూసుకుంటారని చెప్పారు.

ఎన్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ సమక్షంలోనే ఈ ప్రకటన విడుదల చేశారు. అజిత్ పార్టీ మారనున్నారని, ఎన్సీపీలో చీలిక తెస్తారనీ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 1999లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరత్ పవార్, పీఏ సంగ్మా కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.


మరోవైపు తన తండ్రి శరద్ పవార్ కు బెదిరింపులు రావడం పై కుమార్తె సుప్రియ సూలే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఏకనాధ్ షిండే కూడా విచారణకు ఆదేశించారు. ఈ నేపధ్యంలో పోలీసులు సౌరబ్ అనే ఒక వ్యక్తిని నిందితుడిగా గుర్తించినట్టు తెలుస్తోంది. అతను తాను ఒక బీజేపీ కార్యకర్త అంటూ ట్వీటర్ బయో లో రాసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. సౌరబ్ అమరావతి యూనివర్సిటీ లా పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సహనిందితుడుగా కూడా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story