Sharad pawar: రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు

Sharad pawar: రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీతో జతకట్టం... తేల్చిచెప్పిన శరద్ పవార్

‘భారత్ జోడో యాత్ర’ తర్వాత రాహుల్ గాంధీని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటున్నారనీ, ఏదో ఒక రోజు ఆయన దేశానికి నాయకత్వం వహిస్తారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఏదో ఒకరోజు ఆయన నడిపిస్తారని పవార్ అన్నారు. బీజేపీ, ఎన్సీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలకు భయపడి పార్టీ మారని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ రెబల్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీతో తమ పార్టీ చేతులు కలిపే ప్రసక్తే లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.

మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ చర్య ఇండియా కూటమిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇది నేరుగా ఎంపీపైన, పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్‌పైన తీసుకున్న ప్రతీకార చర్య అని అన్నారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వానికి సరిపడని రాజకీయ వ్యక్తులపై సీబీఐ, ఈడీలను ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. ఈడీ చర్య వల్లతో 'ఇండియా' బ్లాక్‌లో ఉన్న ఆప్, కాంగ్రెస్‌లు మరింత చేరువవుతాయని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో, ఢిల్లీ లోక్‌సభ స్థానాలపై కూడా పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని ఏడు సీట్లలో మూడింటిని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తనతో చెప్పారని పవార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తాము నాలుగు సీట్లు మాత్రమే గెలిచామని, అయితే ఈసారి 50 శాతం సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పవార్ అన్నారు.

కాగా, అజిత్ ప‌వార్ బీజేపీ నేతృత్వంలోని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో చేర‌డంతో పార్టీలో చీలిక ఏర్ప‌డ‌టంపై ఎన్సీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందించారు. పార్టీలో చీలిక త‌మ కుటుంబంపై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోద‌ని ఆమె పేర్కొన్నారు. వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన సంబంధాలు వేర్వేరుగా ఉంటాయ‌ని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story