Shashi Tharoor: బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది-బీజేపీపై శశిథరూర్ వ్యంగ్యాస్త్రాలు
బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 650 మంది సభ్యులు ఉండే హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యమైందన్నారు. కానీ, అది భారతదేశంలో కాదు.. మరో దేశంలో సాధ్యం అయిందని ట్విట్టర్ వేదికగా బీజేపీపై శశి థరూర్ సెటైర్ వేశారు.
అబ్ కీ బార్.. 400 పార్’ (ab ki baar, 400 paar)- ఇది లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు విజయం సాధించడమే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేసింది. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే, వారి అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే సాధించగలిగింది. కూటమి పార్టీలతో కలిసి 293 స్థానాలకే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో మోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. కాగా, బ్రిటన్‌లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లలో విజయం సాధించగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com