Shibu Soren: మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్(81) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.
ఝార్ఖండ్ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నెల రోజుల క్రితం స్ట్రోక్‌కు గురైనప్పటి నుంచి ఆయన లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు. తన తండ్రి మరణవార్తను ఆయన కుమారుడు, ప్రస్తుత ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. "గౌరవనీయులైన దిశోమ్ గురు మనందరినీ విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు నేను ఒంటరినైపోయాను..." అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.
ప్రజలు "గురూజీ" అని, "దిశోమ్ గురు" అని ప్రేమగా పిలుచుకునే శిబు సోరెన్, ఝార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన మూడుసార్లు సీఎంగా, ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గిరిజన హక్కుల కోసం, ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన పోరాటం చారిత్రాత్మకమైనది. ఈ కారణంగానే ఆయనను "ఆధునిక ఝార్ఖండ్ పితామహుడు"గా గౌరవిస్తారు.
1944లో నేటి ఝార్ఖండ్‌లోని నేమ్రా గ్రామంలో శిబు సోరెన్ జన్మించారు. ఆయన తండ్రి, ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసిన సోరెన్, 18 ఏళ్ల వయసులోనే గిరిజన యువతను సమీకరించేందుకు "సంథాల్ నవయువక్ సంఘ్"ను స్థాపించారు. ఇదే ఆ తర్వాత ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఆవిర్భావానికి పునాది వేసింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com