Shilpa Shetty : శిల్పా శెట్టిని 4 గంటలపాటు విచారించిన పోలీసులు

Shilpa Shetty : శిల్పా శెట్టిని 4 గంటలపాటు విచారించిన పోలీసులు
X
రూ. 60 కోట్ల మోసం కేసులో నటి శిల్పా శెట్టి విచారణ

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి రూ. 60 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. ఆమె నివాసానికే వెళ్లిన పోలీస్ బృందం, దాదాపు నాలుగున్నర గంటల పాటు శిల్పా శెట్టిని ప్రశ్నించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది.

వ్యాపారవేత్త దీపక్ కొఠారీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు విచారణ జరుగుతోంది. 2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తన వద్ద నుంచి రూ. 60 కోట్లకు పైగా తీసుకుని, ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకుని మోసం చేశారని కొఠారీ తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ విచారణ సందర్భంగా, శిల్పా శెట్టి తన అడ్వర్టైజింగ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలకమైన పత్రాలను కూడా ఆమె అధికారులకు అందజేశారు. ప్రస్తుతం ఆ పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇదే కేసులో గత సెప్టెంబర్ నెలలోనే శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను కూడా ఈఓడబ్ల్యూ అధికారులు విచారించారు. అవసరమైతే అతడిని మరోసారి విచారణకు పిలుస్తామని అప్పట్లో పోలీసులు తెలిపారు. కాగా, తన విచారణలో రాజ్ కుంద్రా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మోసానికి గురైనట్లు చెబుతున్న మొత్తంలో కొంత భాగాన్ని నటీమణులు బిపాసా బసు, నేహా ధూపియాలకు ఫీజుల రూపంలో చెల్లించామని ఆయన పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

పోలీసుల దర్యాప్తులో కంపెనీ ఖాతాల నుంచి శిల్పా శెట్టి, బిపాసా బసు, నేహా ధూపియా సహా నలుగురు నటీమణుల వ్యక్తిగత ఖాతాలకు, అలాగే బాలాజీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు నిధులు బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ మరింత ముమ్మరంగా కొనసాగుతోంది.

Tags

Next Story