SHOCK: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్

దేశంలోని ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థలైన ఉబెర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటం మరియు మహిళా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025'లో కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అడ్వాన్స్ టిప్పింగ్ ఇక చెల్లదు!
ఇప్పటివరకు చాలా యాప్‌లలో రైడ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ (బహుమతి) ఇచ్చే సదుపాయం ఉండేది. అయితే, ఇది ఒక రకమైన 'వేలం పాట'లా మారిందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ టిప్ ఇచ్చేవారికే డ్రైవర్లు ప్రాధాన్యత ఇస్తుండటంతో, సాధారణ ప్రయాణికులకు సేవలు అందడం కష్టంగా మారింది. ఇకపై రైడ్ బుక్ చేసే సమయంలో లేదా ప్రయాణం మధ్యలో టిప్ ఆప్షన్ కనిపించకూడదు. ప్రయాణం పూర్తిగా ముగిసిన తర్వాతే ప్రయాణికులు తమ ఇష్టానుసారం టిప్ ఇచ్చే వెసులుబాటు ఉండాలి. ప్రయాణికుడు ఇచ్చే టిప్ మొత్తంలో యాప్ సంస్థలు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. ఆ నగదు 100% డ్రైవర్‌కే అందాలి.
మహిళా భద్రతకు 'మహిళా డ్రైవర్' ఆప్షన్
మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులు తమ రైడ్ కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్‌నే ఎంచుకునే సదుపాయాన్ని యాప్‌లు తప్పనిసరిగా కల్పించాలి. ప్రస్తుతం గిగ్ ఎకానమీలో మహిళా డ్రైవర్ల సంఖ్య 1% కంటే తక్కువగా ఉంది. ఈ నిబంధన వల్ల యాప్ సంస్థలు మహిళా డ్రైవర్లను రిక్రూట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇది డ్రైవర్ల లభ్యతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
అన్యాయమైన వ్యాపార విధానాలపై కఠిన చర్యలు
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ 'అడ్వాన్స్ టిప్పింగ్' పద్ధతిని "అన్యాయమైన వ్యాపార విధానం"గా గుర్తించింది. డబ్బులు అదనంగా ఇస్తేనే కారు వస్తుందనే భ్రమ కల్పించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సవరణలను తక్షణమే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలకు సరసమైన ధరల్లో క్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు 'మహిళా డ్రైవర్' ఆప్షన్ ఒక భరోసానిస్తుంది. అడ్డగోలు చార్జీలు, టిప్పింగ్ పేరుతో జరిగే దోపిడీకి ఈ నిర్ణయంతో బ్రేక్ పడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

