Psycho killer: స్త్రీలను హింసిస్తూ.. సంతోషించే సైకో కిల్లర్

చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి 2022లో జైలుశిక్ష అనుభవించిన ఓ యువకుడు వింత పధ్ధతిలో ప్రతీకారం మొదలుపెట్టాడు. రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి నిద్రిస్తున్న మహిళల తలపై కొట్టి పరారవుతున్నాడు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు తన ప్రియురాలితో పంచుకుంటున్నాడు. ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 30 ఏళ్ల అజయ్ నిషాద్ అనే యువకుడు ఈ చర్యలకు పాల్పడ్డాడని గోరఖ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ వెల్లడించారు.
నిందితుడు అజయ్ ఐదుగురు మహిళలపై దాడికి పాల్పడ్డాడని, వారిలో ఒకరు తీవ్ర గాయాలతో చనిపోయారని వెల్లడించారు. దాడికి పాల్పడిన ప్రతి సందర్భంలోనూ తన ప్రియురాలికి ఫోన్ చేసి మాట్లాడాడని వివరించారు. నిందితుడు అజయ్ మహిళలపై పగ పెంచుకున్నాడని, ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ విధమైన దాడులకు పాల్పడ్డాడని గౌరవ్ గ్రోవర్ పేర్కొన్నారు. 2022లో పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో అతడు జైలు శిక్ష అనుభవించాడని, అప్పటి నుంచి మహిళలపై పగ పెంచుకున్నాడని వెల్లడించారు.
‘‘అజయ్ నిషాద్ ఎప్పుడూ నల్లని దుస్తులు ధరించి, చెప్పులు లేకుండానే ఉంటాడు. ఇళ్లలోకి చొరబడి కర్రలు లేదా రాడ్లతో మహిళల తలలపై దాడి చేస్తాడు. జైలులో ఉన్న సమయంలో మహిళా ఖైదీల తలపై కొట్టడాన్ని ఇష్టపడేవాడు. ఆ అలవాటునే దాడులకు ఉపయోగించాడు’’ అని ఎస్ఎస్‌పీ గ్రోవర్ చెప్పారు. కాగా 2022 నాటి కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడని వివరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నామని వెల్లడించారు. జులై 30 రాత్రి మొదటి దాడి చేశాడని, ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒక మహిళ తలపై కొట్టి కొన్ని నగలతో పరారయ్యాడని తెలిపారు. నిందితుడు జయ్‌ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముందు ప్రవేశపెట్టి కఠిన శిక్ష పడేలా చూస్తామని గ్రోవర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com