Gang Rape Case: కోల్‌కతా గ్యాంగ్‌రేప్.. మొదటి రోజు నుంచే టార్గెట్.. అంతా పథకం ప్రకారమే

కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. “ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు. బాధితురాలిపై దాడికి ఒడిగట్టడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు. బాధితురాలు కళాశాలలో అడ్మిషన్ పొందిన మొదటి రోజు నుంచే ప్రధాన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు మేము కనుగొన్నాం” అని ప్రత్యేక దర్యాప్తు బృందంలోని ఓ అధికారి వెల్లడించారు.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ముగ్గురు నిందితులైన మోనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్ గతంలో అదే కళాశాలలోని ఇతర విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు సిట్ కనుగొంది. ఈ ముగ్గురు నిందితులు టార్గెట్ చేసి యువతులపై అసభ్యంగా ప్రవర్తించే వారు. తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. అనంతరం ఆ ఫుటేజీని చూయించిబాధితులను బ్లాక్ మెయిల్ చేసేవారు. కోల్‌కతా పోలీసులు ఇప్పుడు నిందితులు రికార్డ్ చేసిన మొబైల్ వీడియోల కోసం శోధిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ముఖర్జీ, అహ్మద్ నివాసాలలో సోదాలు జరిగాయి. జూన్ 25న జరిగిన అత్యాచారానికి సంబంధించిన వీడియో క్లిప్ ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ క్లిప్‌లను ఫార్వార్డ్ చేశారా లేదా మరి ఏదైనా గ్రూపుల్లో పంచుకున్నారా? అని తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని సిట్ బృందం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com