DK COMMENTS: సిద్ధరామయ్య భయపడ్డారు... నేనైతేనా..: డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్నిప్రాజెక్టుల విషయంలో సీఎం సిద్ధరామయ్య వెనకంజ వేశారని... కానీ తానైతే ముందుకే వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలతో సిద్ధరామయ్యతో బంధంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉన్న సమయంలో ఓ ప్రాజెక్ట్ గురించి ఆయన భయపడ్డారని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. దీంతో ఇది కాస్తా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారడమే గాక.. సిద్ధూ - డీకే బంధం బీటలు వారుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ జయంతి సందర్భంగా విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో డీకే శివకుమార్ మాట్లాడారు. టన్నెల్స్, ఫ్లైఓవర్లు నిర్మించాలని చాలా మంది నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని. అయితే అలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా సవాళ్లు ఎదురవుతాయని డీకే అన్నారు. 2017లో ఇలాగే బెంగళూరులో స్టీల్ ప్లైఓవర్ నిర్మించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టింది. అయితే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అప్పటి సీఎం సిద్ధరామయ్య, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ ఈ ఆందోళనలతో భయపడి వెనక్కి తగ్గారు. తానైతే అలాంటి నిరసనలకు తలొగ్గేవాణ్ని కాదని... ప్రాజెక్టు నిర్మాణానికే ముందుకెళ్లేవాడినని డీకే అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే డీకే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. సిద్ధూతో డీకేకు పొసగడం లేదంటూ వదంతులు గుప్పుమన్నాయి. అయితే, శివకుమార్ వ్యాఖ్యలపై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. సిద్ధరామయ్య భయపడ్డారని నేను చెప్పనని... ప్రజల అభిప్రాయాలతో సీఎం సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కొన్ని సార్లు తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమవుతుందన్న ప్రియాంక్ ఖర్గే... డీకే శివకుమార్ ఆ ఉద్దేశంతోనే చెప్పారేమో అని సమస్యలను తేలిక పరిచే ప్రయత్నం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు డీకే హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గి సీఎం రేసు నుంచి వైదొలిగారు. దీంతో సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ ఐక్యంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నా.. ప్రతిపక్ష భాజపా మాత్రం వీరిపై విమర్శలు చేస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని కాషాయ నేతలు జోస్యం చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com