MUDA Scam: ముడా స్కామ్లో నేపథ్యంలో కర్ణాటక సీఎం భార్య పార్వతి సంచలన నిర్ణయం..

MUDA Scam: ముడా స్కామ్లో నేపథ్యంలో కర్ణాటక సీఎం భార్య పార్వతి సంచలన నిర్ణయం..
రాజకీయ కుట్రలకు ఆమె బాధితురాలు అన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

‘ముడా ’ కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పతిప్పలు పెడుతున్న వేళ.. ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి స్పందించారు. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదేమైనా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు.

‘‘ముడా స్థలాల కేటాయింపులో భాగంగా మాకు వచ్చిన భూములను నా భార్య పార్వతి తిరిగిచ్చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ఫిర్యాదులు సృష్టించి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే నా సిద్ధాంతం. కానీ, నాపై జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు చూసి నా భార్య ఆవేదన చెందింది. అందుకే భూములను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇది నాకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. నాలుగు దశాబ్దాల నా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకుండా.. కుటుంబ బాధ్యతలకే పరిమితమైన నా భార్య.. ఇప్పుడు ఇలాంటి విద్వేష రాజకీయాలకు గురై మానసిక క్షోభను అనుభవిస్తోంది’’ అని సిద్ధరామయ్య సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

ముడా వివాదాని కి సంబంధించి సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసిన వేళ.. ఆయన భార్య సోమవారం ఓ లేఖ విడుదల చేశారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ‘‘మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని ఊహించలేదు. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కావు. ఇన్నేళ్లు ఆయన అధికారం నుంచి ఏమీ ఆశించని మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. అందుకే ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగిస్తున్నా. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏమిటో తెలియదు. నా కుటుంబసభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమిది. ఈ ఆరోపణలు వినిపించిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. నా భర్త రాజకీయ కుట్రలో మరింత నష్టపోతున్నాడని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నా. అవసరమైతే దర్యాప్తునకు సహకరిస్తా. రాజకీయ రంగానికి దూరంగా ఉండే నాలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగొద్దు’ అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు, ఈ పరిణామాలపై ముడా కమిషనర్‌ స్పందించారు. ‘ముడా ఆస్తులను ఎవరైనా వెనక్కి ఇచ్చేస్తే మేం తీసుకుంటాం. దీనిపై మేం చర్చలు జరుపుతున్నాం’’ అని వెల్లడించారు.

Tags

Next Story