Sidhu Moose Wala : 58 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి..

దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్‌ఐవీఎఫ్ (IVF) ద్వారా తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సిద్ధూ తండ్రి 60 ఏళ్ల బాల్‌కౌర్ సింగ్ ఆదివారం ఉదయం బాబును ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
‘శుభ్‌దీప్ (సిద్ధూ అసలు పేరు)ను ప్రేమించే కోట్లాది మంది ఆశీర్వాదాలతో శుభ్‌కు తమ్ముడు పుట్టాడు. దేవుడి దయ వల్ల ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. సిద్ధూ మూసేవాలా మళ్లీ పుట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు సిద్ధూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పంజాబ్ తో పాటు దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న 28 ఏళ్ల సింగర్ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన అభిమానులు నిరసన ప్రదర్శనలు చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం కావడంతో.. అతడి మృతితో వారు తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలో ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా చరణ్ కౌర్ గర్భం దాల్చింది. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. . తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆ కుటుంబం వెల్లడించింది. సిద్ధూ మూసేవాలా ఫొటో పక్కన ఒడిలో బాబుతో ఉన్న తండ్రి ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సిద్ధూ అభిమానులు సంతోషంగా కామెంట్లు పెడుతున్నారు. సిద్ధూ భాయ్ మళ్లీ వచ్చాడంటూ సంబరపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com