Sikkim Floods: ఇంకా వ‌ర‌ద గుప్పిట్లోనే...

Sikkim Floods:  ఇంకా వ‌ర‌ద గుప్పిట్లోనే...
సిక్కిం వ‌ర‌ద‌లు.. 56 కు చేరిన మృతుల సంఖ్య‌

తీస్తా న‌ది ప‌రీవాహ‌క ప్రాంతం ఇంకా వ‌ర‌ద గుప్పిట్లోనే ఉంది. సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 56 కు పెరిగింది. సిక్కింతో పాటు ఇటు ప‌శ్చిమ బెంగాల్‌లోని స‌రిహ‌ద్దు జిల్లాల ప్రజలు ఇంకా ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. అక్టోబర్ 4వతేదీన నార్త్ సిక్కింలోని లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ తో తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో 8 మంది ఆర్మీ సిబ్బందితో సహా 56 మంది మరణించారు. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.

గ‌ల్లంతై ఇంకా ఆచూకీ తెలియ‌ని 142 మంది కోసం మూడో రోజైన శుక్ర‌వారం, శనివారం కూడా ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌తో గాలింపు కొన‌సాగింది. గల్లంతైన వారి కోసం తీస్తా ప్రవహించే పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతోంది. సింగ్టామ్ సమీపంలోని బుర్దాంగ్ వద్ద పార్క్ చేసిన 39 వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇండియన్ ఆర్మీ మరియు ఇతర ఏజెన్సీలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉత్తర సిక్కింలోని లాచుంగ్, లాచెన్ లోయల్లో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.

ఈ పరిస్థిలో 1,173 నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయ‌ని సిక్కిం గ‌వ‌ర్న‌మెంట్ వెల్ల‌డించింది. 2,413 మందిని ర‌క్షించిన‌ట్లు తెలిపింది. ఉపగ్రహ టెర్మినల్స్ ద్వారా ఆహారం, వైద్య సహాయం, టెలిఫోన్ కనెక్టివిటీని అందించారు. సైన్యం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేసింది. తీస్తా – వీ హైడ్రో ప‌వ‌ర్ స్టేష‌న్‌కు దిగువ‌న ఉన్న బ్రిడ్జిల‌న్ని ధ్వంసమ‌య్యాయి. కొన్ని వంతెలు వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయాయి. నార్త్ సిక్కింలో క‌మ్యూనికేష‌న్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సిక్కిం ముఖ్య‌మంత్రి ప్రేమ్ సింగ్ త‌మాంగ్ నిన్న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. స‌హాయ‌క చ‌ర్య‌లపై స‌మీక్షించారు. వ‌ర‌ద‌ల్లో చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు రూ. 4 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. దెబ్బ‌తిన్న రోడ్ల‌ను వీలైనంత వ‌ర‌కు పున‌రుద్ధ‌రించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story