Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసు.. మేనేజర్, నిర్వాహకుడిపై మర్డర్ కేసు నమోదు

ప్రముఖ గాయకుడు జుబీన్ గర్గ్ అనుమానాస్పద మృతి కేసు సంచలన మలుపు తీసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా ఆయన బ్యాండ్‌కు చెందిన సహచరుడితో పాటు మరో గాయనిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అస్సాం పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), జుబీన్ బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయని అమృతప్రభ మహంతను గురువారం అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 19న జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన యాట్ పార్టీలో జుబీన్ ఈతకు వెళ్లి నీటిలో తేలుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గోస్వామి, జుబీన్‌కు చాలా దగ్గరగా ఈత కొడుతున్నట్లు, అమృతప్రభ ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపించిందని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. గత ఆరు రోజులుగా వీరిద్దరినీ విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు.
ఇప్పటికే బుధవారం జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ మేనేజర్ శ్యామ్‌కాను మహంతను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్టయిన గోస్వామి, అమృతప్రభలను కూడా వారితో కలిపి విచారించే అవకాశం ఉంది.
మరోవైపు, అరెస్టయిన నిందితులపై నిర్లక్ష్యం కారణంగా మృతి, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో పాటు హత్య కేసు (భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103) కూడా నమోదు చేసినట్లు సిట్ చీఫ్, అస్సాం సీఐడీ స్పెషల్ డీజీపీ మున్నా గుప్తా తెలిపారు. "దర్యాప్తు కొనసాగుతోంది, ఈ సమయంలో మరిన్ని వివరాలు పంచుకోలేను" అని ఆయన అన్నారు.
ఈ పరిణామాలపై జుబీన్ భార్య గరిమా గర్గ్ స్పందించారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తు సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. "ఆ రోజు అసలేం జరిగిందో నిజం తెలియాలి. దోషులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే" అని ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరించేందుకు తమ బృందం సింగపూర్ వెళ్లేందుకు సిద్ధంగా ఉందని, కొన్ని అనుమతులు రావాల్సి ఉందని సిట్ చీఫ్ మున్నా గుప్తా వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com