Uttar Pradesh: ఏడాదిగా తల్లి మృతదేహంతోనే అక్కాచెల్లెళ్లు

Uttar Pradesh: ఏడాదిగా తల్లి మృతదేహంతోనే అక్కాచెల్లెళ్లు
గతేడాది డిసెంబరులో అనారోగ్యంతో చనిపోయిన మహిళ

ఏడాదికి కిందట చనిపోయిన తమ తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా.. శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని అక్కాచెల్లెళ్లు జీవనం సాగిస్తోన్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసి నగరంలో బుధవారం వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే వారణాసి నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి తన ఇద్దరు కూతుళ్లు పల్లవి, వైశ్విక్‌ లతో కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. పల్లవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వైశ్విక్‌ పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె చిన్నదుకాణం నడుపుతూ జీవనం సాగించేది. దానిని నుంచి వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించింది. అయితే గతేడాది డిసెంబరు 8న ఉషా మృతి చెందింది.

తల్లి చనిపోయిందనే విషయాన్ని కూతుళ్లు పల్లవి, వైశ్విక్‌ ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవించసాగారు. ఎప్పుడైనా ఏదైనా కావల్సి వస్తే అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. చనిపోయిన ఉషా త్రిపాఠికి మీర్జాపుర్‌లో ధర్మేంద్రకుమార్‌ అనే సోదరుడు ఉండేవాడు. బుధవారం ధర్మేంద్ర తన చెల్లిని చూసేందుకు ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో ఉన్న పల్లవి, వైశ్విక్ ఎంతసేపటికీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన ధర్మేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూస్తే వారికి కళ్లు బయర్లు కమ్మే సన్నివేశం కనిపించింది. ఒక గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అస్థిపంజరం ఉషా త్రిపాఠిదిగా గుర్తించారు. ఇళ్లంతా చెత్తా చెదారంతో నిండిపోయి, దారుణంగా ఉంది. పోలీసుల దర్యాప్తులో పల్లవి, వైశ్విక్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని తేలింది. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story