SISTERS: ప్రాంతీయ పార్టీలకు సిస్టర్ స్ట్రోక్స్

తెలుగు రాజకీయాల్లో మొన్న షర్మిల, నిన్న కవిత రూపంలో కనిపించిన ‘‘సిస్టర్ స్ట్రోక్’’ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో రోహిణి ఆచార్య వంతుకు వచ్చింది. ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ విభేదాలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తున్నాయో ఈ మూడు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీలకు లేదా అధికార ఆశతో ఉన్న పార్టీలకు సొంత కుటుంబ సభ్యుల నుంచే ఎదురవుతున్న ఈ సవాళ్లు... ఆయా పార్టీల భవిష్యత్తుపై, నేతల ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో కీలక నాయకుల సోదరీమణులు, సొంత అన్నదమ్ములపైనే తిరుగుబాటు చేయడం లేదా ఆరోపణలు గుప్పించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వైసీపీ,బీఆర్ఎస్ లను ఈ పరిణామాలు కుదిపేశాయి. ఇప్పుడు బీహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వంతు వచ్చింది.
వైసీపీకి షర్మిల స్ట్రోక్: రాజకీయ వైరం
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన జైలులో ఉన్నప్పుడు సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర చేసి పార్టీకి అండగా నిలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే జగన్-షర్మిల మధ్య దూరం పెరిగింది. తొలుత తెలంగాణలో వైఎస్సార్టీపీ స్థాపించిన షర్మిల... చివరికి అన్నతో రాజకీయంగా నేరుగా ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు బలమైన అస్త్రం లభించినట్లయింది. ‘‘చెల్లెలికి న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తాడు?’’ అనే విమర్శలు పతాక స్థాయికి చేరాయి.
బీఆర్ఎస్కు కవిత స్ట్రోక్: ఆరోపణల అగ్గి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత... పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సోదరుడు కేటీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.కొంతకాలం తర్వాత పార్టీలోని కీలక వ్యక్తులు హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ ఎంపీగా తాను ఓడిపోవడానికి పార్టీలోని కొన్ని శక్తులే కారణమని ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య ఆమె బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్నారు, చివరకు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కేసీఆర్ వారసత్వంగా, బీఆర్ఎస్ను ముందుండి నడిపిస్తున్న కేటీఆర్‌కు ఈ విభేదాలు వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించాయి.
ఆర్జేడీకి రోహిణి స్ట్రోక్: వైఫల్యమే కారణమా?
తాజాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య ఈ సిస్టర్ స్ట్రోక్‌ను బీహార్‌కు తీసుకెళ్లారు. పార్టీ ఓటమి తర్వాత, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, కుటుంబాన్ని వదులుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.తన సోదరుడు, ఆర్జేడీని నడిపిస్తున్న తేజస్వి యాదవ్‌కు సన్నిహితులు అయిన సంజయ్ యాదవ్, రమీజ్‌లు తనను అవమానించారని, కొట్టారని కూడా ఆమె ఆరోపించడం ఆర్జేడీలో చీలికను బహిర్గతం చేసింది. బీహార్ రాజకీయాల్లో క్రియాశీలంగా మారుతున్న తేజస్వి యాదవ్ నాయకత్వానికి, అతని పనితీరుకు రోహిణి ఆరోపణలు ఒక పెద్ద దెబ్బగా మారాయి. పార్టీ పరాజయానికి బాధ్యత వహించే అంశంపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తాయని ఈ పరిణామం సూచిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

