Manipur Violence: ఏం జరుగుతుందో చెప్పలేను: మణిపూర్ సీఎం
మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రెండు రోజులు గడవక ముందే ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనని చేతులెత్తేశారు. మణిపూర్‌లో హింసాకాండపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన చెందుతున్నారని బీరెన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలను ప్రారంభ దశలోనే అదుపు చేయాల్సి ఉండాల్సిందని... కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనని వ్యాఖ్యానించారు. మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆదివారం బీరెన్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై అమిత్ షా ఆందోళనతో ఉన్నారని భేటీ అనంతరం సీఎం అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. శాశ్వత శాంతిని సాధించే దిశగా మన పనిని పటిష్టం చేసుకోవాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. శాంతి భద్రతల కోసం అన్ని వైపుల నుంచి సహకారం కోరారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్‌కె రంజన్ సింగ్ ఇంటిపై దాడులు సహా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వరకు అన్ని అంశాలను అమిత్ షాకు వివరించినట్లు సీఎం వెల్లడించారు. మణిపూర్‌లో శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల నివేదికను సమర్పించినట్లు తెలిపారు. పౌర సంస్థలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు అందరూ కలిసి మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని సూచించారు. మణిపూర్‌లో నెల రోజులుగా సాగుతున్న అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి 18 రాజకీయ పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపీలు, ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. హింసకు అడ్డుకట్ట వేసి, శాంతిని నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com