పండగ సీజన్‌లో రుణ గ్రహీతలకు ఊరట

పండగ సీజన్‌లో రుణ గ్రహీతలకు ఊరట మారటోరియం కాలానికి 2 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించింది. వీలైనంత త్వరగా చక్రవడ్డీ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వడ్డీ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాపై 6వేల 500 కోట్ల మేర భారం పడనుంది.
కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్‌ఎంఈ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి స్కీమ్ పరిధిలోకి వస్తాయి. ఈ రుణం వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్‌పీఏగా గుర్తించి ఉండకూడదని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ విక్రేతలైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం పేర్కొంది. ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తుందని తెలిపింది.
మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అక్టోబర్ 14న ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com