SNAKES: ఏ పాము కరిచిందో తెలియక.. 3 పాములతో ఆస్పత్రికి

SNAKES: ఏ పాము కరిచిందో తెలియక.. 3 పాములతో ఆస్పత్రికి
X

బీహార్‌లో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రోహతాస్ జిల్లా రాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన గౌతమ్ కుమార్ పాములు పట్టడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అడవుల్లోకి వెళ్లి ప్రమాదకరమైన విషసర్పాలను పట్టుకుని, వాటిని సురక్షితంగా తిరిగి అడవిలో వదిలేయడం అతడికి అలవాటు. అయితే ఈసారి అతడి సేవా ప్రయత్నమే అతడిని ప్రాణాపాయ స్థితికి నెట్టింది. అడవిలో పట్టుకున్న మూడు నాగుపాములను తిరిగి అడవిలో విడిచిపెడుతున్న సమయంలో, వాటిలో ఒక పాము గౌతమ్‌ను కరిచింది. అయితే ఏ పాము కరిచిందో గుర్తించలేకపోయిన అతడు, వైద్యులకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మూడు పాములను కూడా వెంటబెట్టుకుని నేరుగా ససారం జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు. అతడు ఆసుపత్రి ప్రాంగణంలోకి విషసర్పాలతో రావడంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. పాములను చూసిన రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వైద్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. గౌతమ్‌కు అవసరమైన చికిత్సను తక్షణమే ప్రారంభించి అతడి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, పాము కాటుకు గురైనప్పుడు భయాందోళనకు గురైతే విషం శరీరమంతా వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. గౌతమ్ ఎక్కువగా ఆందోళన చెందకపోవడం అతడికి మేలు చేసిందని పేర్కొన్నారు. అయితే, పాములను నేరుగా ఆసుపత్రికి తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు. కాటుకు గురైన పామును గుర్తించేందుకు ఫొటో తీసుకోవడం లేదా దాని లక్షణాలను వివరించడం సరిపోతుందని సూచించారు. ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఆ మూడు పాములను స్వాధీనం చేసుకుని, వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.

Tags

Next Story