Aditya-L1 Mission: కీలక ప్రకటన చేసిన ఇస్రో..

Aditya-L1 Mission:  కీలక ప్రకటన చేసిన ఇస్రో..
శాస్త్రీయ డేటా సేకరణ ప్రారంభం

చంద్రయాన్ సక్సెస్ తర్వాత మంచి ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో సూర్యుడిపై అధ్యయనానికి ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో ఇటివలే ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ఇస్రో ట్విటర్ వేదికగా పంచుకుంది. ఆదిత్య-ఎల్1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఈ సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది. మిషన్‌లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రా-థర్మల్, ఎనర్జిటిక్ ఐయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలవడాన్ని ఆరంభించాయి. భూమి చుట్టూ ఉండే కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో ఈ డేటా దోహదపడుతుంది. యూనిట్లలోని ఒక దాని ద్వారా సేకరించిన డేటా శక్తివంతమైన కణాల పర్యావరణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తుంది’’ అని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.


ప్రస్తుతానికి భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ దిశగా ఆదిత్య ఎల్1 దూసుకెళ్తోంది. భూమి, సూర్యుని మధ్య అటువంటి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. అపకేంద్ర శక్తి సృష్టించబడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక వస్తువును ఈ స్థలంలో ఉంచినట్లయితే, అది సులభంగా రెండింటి మధ్య స్థిరంగా ఉంటుంది. శక్తి కూడా తక్కువగా ఉంటుంది. మొదటి లాగ్రాంజ్ పాయింట్ భూమి, సూర్యుని మధ్య 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.


సరళంగా చెప్పాలంటే, L-1 అనేది సూర్యుడు, భూమి నుంచి సమాన దూరంలో ఉన్న ఏదైనా వస్తువు స్థిరంగా ఉండగల పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ కి చేరుకోవడానికి ప్రయోగించిన రోజు నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఇక ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయనున్నాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి శోధిస్తాయి.


Tags

Read MoreRead Less
Next Story