Congress: ఢిల్లీలో సోనియా గాంధీతో కాంగ్రెస్ నేతలు.. చింతన్ శిబిర్‌పై చర్చ..

Congress: ఢిల్లీలో సోనియా గాంధీతో కాంగ్రెస్ నేతలు.. చింతన్ శిబిర్‌పై చర్చ..
Congress: ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది.

Congress: ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ కీలకమైన సమావేశంలో ఈనెల 13 నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగే చింతన్ శిబిర్‌, పార్టీని వేగంగా బలోపేతం చేయడం సహా పలు అంశాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే 136 ఏళ్ల పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన నిర్ణయాలను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీలో సంచలన సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు.

సీడబ్ల్యూసీ మొదలుకొని పీసీసీ, బూత్ స్థాయి కమిటీల దాకా అన్నింటా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం కల్పించేలా పార్టీ రాజ్యాంగాన్ని సవరించనున్నారు. అలాగే పీసీసీ అధ్యక్షుల చేతికి మరిన్ని అధికారాలు అప్పగించనున్నారు. వీటన్నింటిపై చింతన్‌ శిబిర్‌లో విస్తృతంగా చర్చించి పార్టీ రాజ్యాంగాన్ని సవరించడంతో పాటు 2024 ఎన్నికల ఎజెండా, కాంగ్రెస్ బలోపేతానికి సంస్థాగత సంస్కరణలకు ఆమోదం తెలుపాలని అధిష్టానం నిర్ణయించింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తిరిగి పునరుత్తేజం నింపేందుకు ఏం చేయాలి? ఏ రకంగా మళ్లీ దేశ ప్రజలను పార్టీ వైపు తిప్పుకోవాలనే దానిపై సీడబ్ల్యూసీలో నేతలకు సోనియాగాంధీ దిశానిర్దేశం చేశారు. పార్టీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రదండం లేదన్న ఆమె.. ఉదయ్‌పూర్‌లో జరిగే నవసంకల్ప చింతన్‌ శిబిర్‌ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని స్పష్టంచేశారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ జరగాలని సోనియగాంధీ అభిప్రాయపడ్డారు. ఇక.. 2014 నుంచి వరుస ఓటముల నేపథ్యంలో తొలిసారి అంతర్గత మేథోమథనానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్.

ఇందుకు ఈనెల 13 నుంచి 15 వరకు మూడ్రోజుల పాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా దాదాపు 400 మందితో చింతన్ శిబిర్ ఏర్పాటు చేసింది. రాజకీయాలు, సామాజిక న్యాయం, సాధికారత, ఆర్థిక వ్యవస్థ, సంస్థ, రైతులు, వ్యవసాయం, యువత, సాధికారత వంటి అంశాలను 6 గ్రూపులుగా చర్చించనున్నారు. అనంతరం నవసంకల్ప్‌ తీర్మానాలను సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాత అమలు చేయనున్నారు.

పార్టీ వేగవంతమైన పునరుజ్జీవనానికి ఉదయపూర్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లేలా నేతలు సహకారం అందించాలని సోనియాగాంధీ కోరారు. మరి ఉదయ్‌పూర్ నవసంకల్ప చింతన్‌ శిబిర్‌.. కాంగ్రెస్‌ పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తెచ్చిపెడుతుందా? 2024లో కేంద్రంలో పార్టీకి అధికారం తెచ్చిపెడుతుందా? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story