Great Nicobar Island project: గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విమర్శలు

షోంపెన్, నికోబారీస్ తెగల మనుగడకే ప్రమాదమని తీవ్ర ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్ ఒక "పెద్ద పర్యావరణ విపత్తు" అని అభివర్ణించిన ఆమె, ఇది ఆదివాసీ తెగల హక్కులను కాలరాయడమే కాకుండా, దేశంలోని అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రముఖ దినపత్రికలో ఆమె ఒక వ్యాసం రాశారు.

షోంపెన్, నికోబారీస్ వంటి ఆదిమ తెగల మనుగడకే ప్రమాదం వాటిల్లినప్పుడు దేశ ప్రజల మనస్సాక్షి మౌనంగా ఉండకూడదని సోనియా గాంధీ తన వ్యాసంలో పేర్కొన్నారు. రూ. 2,72,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల అక్కడి ఆదివాసీ తెగలు, అరుదైన వృక్ష, జంతుజాలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె అన్నారు. "భవిష్యత్ తరాల కోసం ఈ అద్వితీయమైన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మనమందరం గళం విప్పాలి" అని ఆమె పిలుపునిచ్చారు.

ప్రాజెక్ట్ నిర్మాణంలో రాజ్యాంగపరమైన, చట్టపరమైన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సోనియా ఆరోపించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను సంప్రదించలేదని, గ్రేట్ నికోబార్ గిరిజన మండలి విజ్ఞప్తులను పెడచెవిన పెట్టారని ఆమె విమర్శించారు. భూసేకరణ చట్టం-2013 కింద నిర్వహించిన సామాజిక ప్రభావ మదింపులో షోంపెన్, నికోబారీస్ తెగలను భాగస్వాములుగా చేర్చకపోవడం దారుణమని అన్నారు.

పర్యావరణ నష్టంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం అధికారిక లెక్కల ప్రకారం 8.5 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుందని, అయితే స్వతంత్ర అంచనాల ప్రకారం ఈ సంఖ్య 32 లక్షల నుంచి 58 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు. దీనికి పరిహారంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలో మొక్కలు నాటతామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పైగా ఆ భూమిలో కొంత భాగాన్ని హర్యానా ప్రభుత్వం మైనింగ్ కోసం వేలం వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

తాబేళ్లు గుడ్లు పెట్టే సున్నితమైన తీర ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేపట్టడంపై సోనియా అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాల ముప్పు అధికంగా ఉన్న జోన్‌లో ఉందని, ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రజలు, పర్యావరణం తీవ్ర ప్రమాదంలో పడతాయని ఆమె హెచ్చరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం, టౌన్‌షిప్, పవర్ ప్లాంట్ నిర్మించనున్నారు.

Tags

Next Story