Money Laundering: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దూకుడు..

Money Laundering: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దూకుడు..
X
సోనియా, రాహుల్‌తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఆస్తుల జప్తు ప్రక్రియను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం ప్రారంభించింది. సోనియా, రాహుల్‌ గాంధీ యజమానులుగా ఉన్న యంగ్‌ ఇండియన్‌ లిమిటెడ్‌(వైఐఎల్‌) అధీనంలోని అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు చెందిన ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తుల్లో ఉంటున్న కంపెనీలు, వ్యక్తులకు ఏప్రిల్‌ 11న ఈడీ నోటీసులు జారీ చేసింది. ఒకప్పుడు నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికను ప్రచురించిన ఏజేఎల్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.

బీజేపీ నాయకుడు డాక్టర్‌ సుబ్రమణియన్‌ స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. రూ. 2,000 కోట్ల మేర విలువైన ఆస్తులను దక్కించుకోవాలన్న దురుద్దేశంతో ఏజేఎల్‌ ఆస్తులను యంగ్‌ ఇండియా స్వాధీనం చేసుకుందని డాక్టర్‌ స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఏజేఎల్‌ ఆస్తులకు సంబంధించిన రూ.988 కోట్ల మనీ లాండరింగ్‌ జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఇదివరకు ప్రకటించింది. తదుపరి చర్యలలో భాగంగా ఆస్తుల జప్తు చర్యలను దర్యాప్తు సంస్థ ప్రారంభించింది. 2023 నవంబర్‌లో రూ. 661 కోట్ల విలువైన ఢిల్లీ, ముంబై, లక్నోలోని స్థిరాస్తులతోపాటు రూ.90.2 కోట్ల విలువైన ఏజేఎల్‌ షేర్లను ఈడీ ప్రాథమికంగా జప్తు చేసింది. ముంబైలోని హెరాల్డ్‌ హౌస్‌లో ఉంటున్న జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ ప్రాజెక్టులకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.

Tags

Next Story