Parliament Session: 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

Parliament Session: 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
లోక్‌సభను ముందుగా రద్దు చేస్తారంటూ ప్రచారం, జమిలి, యూసీసీ, ఓబీసీ వర్గీకరణలపైనా అంచనాలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయంపై పలు ఊహాగానాలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు డిసెంబరులోనే రావొచ్చని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ వంటి నేతలు జోస్యం చెబుతున్న నేపథ్యంలో.. లోక్‌సభను రద్దు చేయడానికే కేంద్రం ఈ సమావేశాలను నిర్వహిస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాకాల సమావేశాలు ముగిశాక నవంబరు మూడోవారం తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగియగా 40 రోజుల్లోపే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వేర్వేరు వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి.


జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికి పార్లమెంటును సమావేశపరుస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర హోదా పునరుద్ధరణ గురించి ప్రశ్నించినప్పుడు ఆ రెండింటికీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. జి-20 శిఖరాగ్ర సదస్సు, చంద్రయాన్‌-3 విజయవంతం కావడం వంటివి ఎజెండాలో ఉంటాయని వినవస్తోంది. మంత్రి ప్రహ్లాద్‌జోషి తన ట్వీట్‌లో అమృత్‌కాలాన్ని ప్రస్తావించినందున ఆ అజెండాతో సమావేశాలు జరగొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ముందు.. ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణకు జస్టిస్‌ రోహిణి కమిషన్‌ చేసిన సిఫార్సుల ఆమోదం వంటివి చర్చించడానికేనని మరికొందరు చెబుతున్నారు. సమావేశాలను కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహించే అవకాశం ఉంది.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. జమిలి దిశగా వెళ్లాలంటే అడ్డంకులను అధిగమించాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఇటీవల రాజ్యసభలో బదులిచ్చారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో ప్రజాధనం ఆదా కావడంతోపాటు, అధికార యంత్రాంగానికి, రాజకీయ పార్టీలకు వనరులు కలిసివస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలో కనీసం అయిదు అధికరణలను సవరించాలి. రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవాలి. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సేకరించాలి. అదనపు పోలింగ్‌ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం’ అని ఆయన ఆరోజు తెలిపారు.

ఐతే.. పారిశ్రామికవేత్త అదానీపై తాము లేవనెత్తిన కీలక అంశాలకు భయపడే ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల పేరుతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. తనకు సన్నిహితుడైన వ్యక్తి గురించి ఎప్పుడు ప్రస్తావించినా మోదీ వణికిపోతూ అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. తాను పార్లమెంటులో మాట్లాడినప్పుడూ సర్కారులో ఇదే భయాన్ని చూశానన్నారు. విపక్ష కూటమి సమావేశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సమావేశాల ప్రకటన చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ విమర్శించారు. దేశవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన వినాయకచవితి పండుగనాడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభించడమేంటని ఎన్సీపీ ప్రశ్నించింది. తేదీలను మార్చాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story