Tamil Nadu:రుపీ సింబల్‌కుమంగళం .. తమిళనాడు బడ్జెట్ లోగోలో మార్పు

తమిళనాట భాషా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో తమిళ పదం రూబాయిని చేర్చి జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) వ్యతిరేకించే విషయంలో తగ్గేది లేదని కేంద్రానికి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన టీజర్‌ను ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమిళనాడు సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ బడ్జెట్‌ని రూపొందించినట్టు స్టాలిన్ ట్వీట్ చేశారు.
రూపాయి సింబల్ రూపకర్త ఎవరంటే..
ద్రవిడియన్ మోడల్, టీఎన్‌బడ్జెట్ 2025 హ్యాష్‌ట్యాగులతో విడుదల చేసిన బడ్జెట్ లోగోలో హిందీ అక్షరం ఆర్ స్ఫూర్తితో రూపొందిన అధికారిక రూపాయి చిహ్నం మాయమైంది. ఆ స్థానంలో తమిళ పదం రూబాయికి చిహ్నమైన రూ అనే తమిళ అక్షరం దర్శనమిచ్చింది. గత రెండు వార్షిక బడ్జెట్‌లలో మాత్రం అధికారిక రూపాయి చిహ్నమే లోగోలలో ఉండడం విశేషం. 2023-24 బడ్జెట్ లోగోలో కూడా అధికారిక రూపాయి చిహ్నమే ఉంది. దీన్ని ఐఐటీ-గువాహటి ప్రొఫెసర్ డిజైన్ చేశారు. ఆయన డీఎంకే నాయకుడు కుమారుడు కావడం గమనార్హం.
రూపాయి చిహ్నాన్ని తిరస్కరించడంగా చూడరాదు..
జాతీయ కరెన్సీ చిహ్నాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్‌ఈపీ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అధికారిక రూపాయి చిహ్నాన్ని రాష్ట్రం తిరస్కరించడంగా దీన్ని భావించరాదని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ పేర్కొన్నారు. తమిళ అక్షరం రూ ఉపయోగించడం ద్వారా తమిళ భాషను ప్రోత్సహించే ప్రయత్నంగా చూడాలని ఆయన తెలిపారు.
తమిళ ప్రజలను నవ్వులపాలు చేశారు: బీజేపీ
అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మూర్ఖత్వానికి పరాకాష్టగా అన్నామలై అభివర్ణించారు. యావద్దేశం ముందు తమిళ ప్రజలను నవ్వులపాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ స్పందిస్తూ ముఖ్యమంత్రి మూర్ఖపు చర్యకు పాల్పడరాదని, రాష్ట్ర హక్కుల పేరిట ప్రజలను రెచ్చగొట్టరాదని చెప్పారు. రూపాయి చిహ్నాన్ని మార్చినందుకు స్టాలిన్‌పై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ మండిపడ్డారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఉన్నత విద్యావంతుడు, డిజైనర్ ఉదయ కుమార్ ధర్మలింగం భారతీయ రూపాయి చిహ్నాన్ని రూపొందించారని, తమిళనాడు బడ్జెట్ నుంచి అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళ ప్రజలను అవమానించారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com