Statehood for Ladakh: లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం నిరాహార దీక్ష

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. రాష్ట్ర హోదాతో పాటు మరో నాలుగు డిమాండ్లను నెరవేర్చాలని కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ నిరాహార దీక్ష చేపట్టింది. ఆదివారం నుంచి మూడ్రోజులపాటు ఈ నిరాహార దీక్ష చేపట్టనుంది. మరోవైపు క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష 19వ రోజుకి చేరుకుంది. లేహ్ అపెక్స్ బాడీ, కేంద్రానికి మధ్య చర్చల ప్రతిష్ఠంభన గురించి అసంతృప్తి వ్యక్తం చేశారు సోనమ్ వాంగ్ చుక్.
హక్కుల కోసం లడఖ్ యూనియన్ టెరిటరీ ఆందోళనలు ముమ్మరం జేసింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, భూమి, ఉద్యోగాల్లో ప్రత్యేక హక్కులు ఇవ్వాలంటూ లేహ్, కార్గిల్ జిల్లాల ప్రజలు కలిసికట్టుగా కేంద్రంపై పోరాడుతున్నారు. ఇందులో భాగంగా లడఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌ను, అక్కడి ప్రజలను కాపాడాలంటూ ఆయన మార్చి 6న లేహ్‌లో ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు.
ఇప్పటివరకూ ఆయనకు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు తెలిపారు. వాంగ్ చుక్కు సంఘీభావం తెలుపుతూ ఇటు లేహ్‌లోని అపెక్స్ బాడీ, అటు కార్గిల్‌లోని కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్ ఆధ్వర్యంలో దాదాపు 5 వేల మంది ఆదివారం నుంచి 3 రోజుల నిరాహారదీక్షను ప్రారంభించారు. నిజానికి ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. జమ్మూకాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్‌ను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019 ఆగస్ట్ 5 తర్వాత లడఖ్ ప్రజల్లో మొదలైన ఆందోళనలే క్రమంగా ఉద్యమ రూపం దాల్చాయి.
ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు యూటీలుగా విభజించింది. ప్రత్యేక హోదా రద్దు కావడంతో మిగతా జమ్మూకాశ్మీర్ ప్రజల మాదిరిగానే లడఖ్ లో ఉన్న రెండు జిల్లాల(లేహ్, కార్గిల్) ప్రజల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. అప్పటివరకూ స్థానిక భూములు, ఉద్యోగాల్లో తమకు మాత్రమే హక్కులు ఉండగా.. స్పెషల్ స్టేటస్ రద్దు తర్వాత వాటన్నింటికీ తాము దూరమయ్యామన్న ఆందోళనలు తలెత్తాయి. లేహ్ లో ప్రధానంగా బుద్ధిస్టులు మెజార్టీగా ఉండగా, కార్గిల్ లో ముస్లింలు మెజార్టీగా ఉన్నారు.
దీంతో ఉమ్మడి హక్కుల కోసం రెండు వర్గాల వారితోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ వంటి రాజకీయ పార్టీలు, స్థానిక సంఘాలు కూడా ఏకమయ్యాయి. లడఖ్ యూటీకి 6వ షెడ్యూల్ స్టేటస్ ను కల్పించాలని 2019 లో జాతీయ ఎస్టీ కమిషన్ కూడా సిఫారసు చేసింది. అప్పటి నుంచే కేంద్రం చర్చలు జరుపుతూ వస్తున్నా.. నేటికీ సఫలం కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com