UP: సమయానికి వరుడు రాలేదని బావతో పెళ్లి.. ఎందుకు చేసుకున్నాదంటే..

UP: సమయానికి వరుడు రాలేదని బావతో పెళ్లి.. ఎందుకు చేసుకున్నాదంటే..
సామూహిక వివాహం పేరుతో ఘరానా మోసం..

ముహూర్తం సమయానికి వరుడు రాలేదని.. వధువు తన బావను పెళ్లాడింది. అయితే, అది ప్రేమతోనో, పరువు పోతుందనో కాదు అది ఉత్తుత్తి పెళ్లి. . సామూహిక వివాహ పథకం కింద ప్రభుత్వం అందజేసే రూ.50 వేల కోసం కక్కుర్తిపడి ఇలా చేసినట్టు తేలింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద కొత్తజంటలకు యూపీ ప్రభుత్వం రూ.51 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ వేదికగా మంగళవారం జరిగిన సీఎం సామూహిక వివాహ కార్యక్రమంలో 132 జంటలు ఒక్కటయ్యాయి.

ఈ సామూహిక వివాహంలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఝాన్సీ సమీప బామౌర్‌కు చెందిన ఖుషీకి మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృష్‌ భానుతో పెల్లి నిశ్చయమైంది. వీళ్లు కూడా సామూహిక వివాహ కార్యక్రమానికి పేరు నమోదుచేసుకున్నారు. వీరిద్దరి పేరుతో 36 నంబరు రిజిస్ట్రేషను నమోదైంది. అయితే, పెళ్లిపీటలపై ఖుషీ పక్కన కూర్చున్న వరుడు, ఫోటోలో ఉన్న వ్యక్తి వేర్వేరుగా ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వారు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లికుమారుడు సమయానికి రాలేదని, పెద్దల సలహాతో తాను కూర్చొన్నట్లు నకిలీ వరుడు బయటపెట్టాడు. అతడు ఖుషీకి వరుసకు బావ అవుతాడని కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక, ప్రభుత్వం అందజేసిన కానుకలను ఖుషీ కుటుంబసభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు.

సీఎం సామూహిక వివాహ పథకం కింద మొత్తం రూ.51,000 అందజేస్తోంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో రూ.35,000 నేరుగా వధువు బ్యాంకులో ఖాతాలో జమచేస్తారు. రూ.10,000 కొత్త కాపురానికి అవసరమైన సామాగ్రి, రూ.6,000 వివాహ కార్యక్రమానికి చెల్లిస్తారు.

ఇక, జనవరి 25న బలియా జిల్లాలో మణియార్ కాలేజీలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలోనూ నకిలీ పెళ్లిళ్లు జరిగినట్టు వెల్లడైన విషయం తెలిసిందే. 568 జంటలు పెళ్లి చేసుకోగా.. చాలా మంది డూప్ పెళ్లిళ్లు చేసుకున్నారు. వారంతా ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందేందుకు ఇలా చేశారని అధికారుల విచారణలో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story