SC: శునకాల ప్రేమ సరే.. మనుషుల ప్రాణాల సంగతి ఏంటి?

SC: శునకాల ప్రేమ సరే.. మనుషుల ప్రాణాల సంగతి ఏంటి?
X
శునక ప్రేమపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించింది. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు లేదా వృద్ధులు గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు, బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది వీధి కుక్కల వల్ల ప్రజలకు భద్రతా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. వీధి కుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైతే, ప్రతి దాడికి, ప్రతి మరణానికి గానూ భారీ పరిహారాలు చెల్లించాల్సి వస్తుందని కోర్టు స్పష్టమైన హెచ్చరిక చేసింది. ధర్మాసనం ఈ సందర్భంగా మరింత కఠిన వ్యాఖ్యలు చేసింది. “ఒక సంస్థ వీధి కుక్కలకు ఆహారం పెడుతూ, ఆ కుక్కల దాడిలో ఒక చిన్నారి మరణిస్తే… ఆ ప్రాణనష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ సంస్థ బాధ్యత నుంచి తప్పించుకోగలదా?” అని ప్రశ్నించింది. ప్రజల భద్రతను విస్మరించి వీధుల్లో కుక్కలు తిరగడం సహించబోమని కోర్టు తేల్చిచెప్పింది.

విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి సున్నితమైన ప్రాంతాల్లో వీధి కుక్కల ఉనికిని తక్షణమే తొలగించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. చిన్నపిల్లలు, రోగులు, వృద్ధులు ఉండే ప్రదేశాల్లో కుక్కల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని కోర్టు పేర్కొంది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారి పాత్రపై కూడా సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చింది. కేవలం భావోద్వేగంతో వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడం ద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే, ఆహారం పెట్టే వారు కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరని కోర్టు వ్యాఖ్యానించింది. “మీకు కుక్కలపై అంత ప్రేమ ఉంటే, వాటిని మీ ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకోండి. వీధుల్లో వదిలేసి ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేం అంగీకరించం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాష్ట్రాలదే బాధ్యత

పిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినా లేదా మరణం సంభవించినా, రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. కేవలం మున్సిపాలిటీలపై బాధ్యత నెట్టివేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడింది. రాష్ట్రాలు తగిన విధానాలు రూపొందించి, వీధి కుక్కల సంఖ్య నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారు కూడా సమాజ భద్రతపై బాధ్యత వహించాల్సిందేనని, తమ ఇళ్లకు తీసుకెళ్లకుండా వీధుల్లో వదిలేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story