Bengaluru: ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం

Bengaluru: ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం
X
అత్యాచారం తరువాత పిల్‌ అవసరమా అని అడిగిన నిందితుడు

ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై క్లాస్‌మేట్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పిల్‌ కావాలా అని ఆమెను అడిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల జీవన్ గౌడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఏడో సెమిస్టర్‌లో ఉండాల్సిన అతడు చదువులో వెనుకపడటంతో ఆరో సెమిస్టర్‌లో కొనసాగుతున్నాడు.

కాగా, అక్టోబర్‌ 10న లంచ్‌ బ్రేక్‌లో ఏడో సెమిస్టర్‌ చదువుతున్న క్లాస్‌మేట్‌కు జీవన్ పలుసార్లు ఫోన్‌ చేశాడు. ఏడో అంతస్తులోని ఆర్కిటెక్చర్ బ్లాక్ దగ్గర తనను కలవమని చెప్పాడు. ఆమె అక్కడకు చేరుకోగా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ విద్యార్థిని లిఫ్ట్‌లో వెళ్లగా ఆమెను అనుసరించాడు. ఆరవ అంతస్తులోని మెన్స్‌ టాయిలెట్‌లోకి ఆ యువతిని లాక్కెళ్లాడు. డోర్‌ లాక్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంత సమయం తర్వాత ఆమెకు ఫోన్ చేసి గర్భం రాకుండా ఉండేందుకు పిల్‌ అవసరమా అని అడిగాడు.

మరోవైపు తొలుత ఫిర్యాదు చేసేందుకు బాధిత విద్యార్థిని సంకోచించింది. తన స్నేహితురాళ్లకు ఈ విషయం చెప్పింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు జరిగిన సంఘటన వివరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 15న పేరెంట్స్‌తో కలిసి హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన జీవన్ గౌడను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.

Tags

Next Story