Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్ధినుల లేఖ

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయాలని హరియాణ రాష్ట్రానికి చెందిన సిర్సాలో దేవీ లాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్ధినులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు లేఖ రాశారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జిచే విచారణ చేపట్టాలని విద్యార్ధినులు కోరుతున్నారు. లేఖ ప్రతులను వీసీ డాక్టర్ అజ్మీర్ సింగ్ మాలిక్, హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా సంస్ధలకు పంపారు.
నిందిత ప్రొఫెసర్ అసభ్యకరమైన, నీచమైన చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తన ఆఫీసుకు అమ్మాయిలను పిలిపించి.. బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ‘ప్రయివేట్ భాగాలను తాకడం, చెప్పుకోలేని చేష్టలు’కు పాల్పడి దారుణంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అతడి చర్యలను అడ్డుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు వాపోయారు. ఇది చాలా నెలలుగా జరుగుతోందని, వీసీ కూడా తమకు సహకరించలేదని తెలిపారు. ‘మమ్మల్ని బహిష్కరిస్తామని బెదిరించారు. ఎందుకంటే ఈ ప్రొఫెసర్ చాలా రాజకీయ పలుకుబడి కలిగిన కాబట్టి తిరిగి మమ్మల్ని బెదిరిస్తున్నారని’ తెలిపారు. అమ్మాయిలు రాత, ప్రాక్టికల్ పరీక్షల్లో మెరుగైన మార్కులు పేరుతో వైస్ ఛాన్సలర్ కూడా ఆరోపణలను అణిచివేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఇక, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అజ్ఞాత లేఖ అందినట్లు ధ్రువీకరించారు. ‘దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు... యూనివర్శిటీకి దాని స్వంత కమిటీ ఉంది.. ఇది ఆరోపణలను విచారిస్తోంది. ఇది తీవ్రమైన ఆరోపణ. లేఖపై పేరు లేదు, కానీ మేము దీనిపై దర్యాప్తు చేస్తాం.. తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటారు. దోషులు ఎవరైనా తప్పించుకోరు, కానీ ఎవరైనా నిర్దోషి అయితే వారి పాత్రను తప్పుగా చిత్రీకరించకూడదు’ అని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసినట్లు డాక్టర్ బన్సాల్ తెలిపారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే ‘తన కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీ నుంచి విద్యార్ధినులతో తన అసభ్యకరమైన చర్యలను తొలగించారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో తమ కుటుంబాలకు అపమానం జరుగుతుందనే భయంతో తమ గుర్తింపును బయటపెట్టడంలేదని చెప్పారు. ప్రజాప్రాయంతో ప్రొఫెసర్‌ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తారని తాము ఆశించడం లేదని, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా లేఖలో కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com