IAS Study Circle: ముగ్గురిని బలితీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్

ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ఎదున విద్యార్థులు ధర్నాకు దిగారు. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లలోనూ భద్రతా ఉల్లంఘనలు ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో వరదనీరు నిలుస్తుండటంపై వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. స్టడీ సర్కిల్ యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగమే ముగ్గురి మరణానికి కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లో పెద్ద ఎద్దును పోలీసులను మోహరించారు. మృతుల్లో తెలంగాణ చెందిన యువతి కూడా ఉన్న విషయం తెలిసిందే.
శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com