SC: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

SC: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X
ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. 6:1తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.

రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ అందుతున్నాయో లేదో చూడాలని 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఎస్సీల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. వెనుకబాటు ప్రాతిపదికన ఎస్సీలను నాలుగు వర్గాలుగా విభజించాలని కమిషన్ సూచించింది. 15 శాతం రిజర్వేషన్లను గ్రూప్-ఏకు ఒకశాతం, గ్రూప్ బీకు ఏడు శాతం, గ్రూప్ సీకు ఆరు శాతం, గ్రూప్ డీకు ఒక శాతంగా విభజించాలని చెప్పింది. ఈ సూచనలను ప్రభుత్వం ఆమోదించింది.ఈ మార్పులను ఒక ఆర్డినెన్సుగా తీసుకొచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్) యాక్ట్-2000ను రూపొందించింది.

దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన అనంతరం ఎస్సీలను వర్గీకరించకూడదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేసింది. 2000లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరించేటప్పుడు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నివేదికను ఆధారంగా చూపించింది. మరోవైపు తమిళనాడులోనూ అరుంధతియార్ వర్గానికి ఇలానే రిజర్వేషన్ కల్పించారు. వీరు ఎస్సీ జనాభాలో 16 శాతం ఉన్నప్పటికీ ఉద్యోగాల విషయంలో వీరి ప్రాతినిధ్యం 0-5 శాతం వరకు మాత్రమే ఉందని జస్టిస్ ఎంఎస్ జనార్థనమ్ కమిటీ నివేదించింది. దీంతో వీరికి ఎస్సీ రిజర్వేషన్‌లో మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. 2007లో ఎస్సీల్లో వెనుకబడిన వారిని గుర్తించాలని బిహార్ కూడా మహాదళిత్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది.

Tags

Next Story