Supreme Court: దీపావళికి గ్రీన్‌ క్రాకర్స్‌కు ఓకే.. అనుమతించిన సుప్రీంకోర్టు

Supreme Court: దీపావళికి గ్రీన్‌ క్రాకర్స్‌కు ఓకే.. అనుమతించిన సుప్రీంకోర్టు
X
అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, పేల్చడానికి అనుమతి

దేశ రాజధాని ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వాడకంపై అనుమతిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకం, పేల్చడానికి అనుమతి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

పొల్యూషన్ కారణంగా బాణాసంచా కాల్చడంపై 2018 నుంచి ఢిల్లీలో నిషేధం ఉంది. దీంతో బాణాసంచా కాల్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం పిటిషన్లు విచారించిన గవాయ్.. కీలక తీర్పు వెలువరించారు. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 21 వరకు గ్రీన్ క్రాకర్లు అమ్ముకునేందుకు.. కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. బాణసంచా పేల్చడం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది.

ప్రాంతీయ పండుగలకు అనుగుణంగా సమయాలను సర్దుబాటు చేసి, నియమించబడిన ప్రాంతాల్లో మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని తెలిపింది. క్యూఆర్ కోడ్‌లతో ఉన్న గ్రీన్ క్రాకర్లే అమ్మేలా పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు పోలీసులకు సూచించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఆన్‌లైన్ అమ్మకాలను నిషేధించాలని తెలిపింది.

ఆదేశాలు ..

NEERI, PESO ఆమోదించిన గ్రీన్ క్రాకర్లను మాత్రమే అనుమతించాలి.

లైసెన్స్ పొందిన వ్యాపారులు, తయారీదారుల ద్వారా అమ్మకాలు నిర్వహించాలి.

బేరియం, లిథియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, సీసం, పాదరసం వంటి రసాయన పరిమితులకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాలి.

ప్రాంతీయ పండుగలకు సమయాలను సర్దుబాటు చేసి.. నియమించబడిన ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలి

అనధికార ఉత్పత్తిపై లైసెన్స్ సస్పెన్షన్, తయారీ యూనిట్లను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠినమైన చర్యలు తీసుకోవాలి.

రేఖా గుప్తా స్వాగతం..

సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వాగతించారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు రాజధానిలో ఆకుపచ్చ బాణసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చినందుకు గౌరవనీయ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం దీపావళి వంటి పవిత్ర పండుగల సమయంలో ప్రజల మనోభావాలను, ఉత్సాహాన్ని గౌరవిస్తుంది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పట్ల సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.

Tags

Next Story