Supreme Court: బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ

వీధి కుక్కల బెడదపై మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆస్పత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో తిరిగే కుక్కలను వెంటనే తొలగించి షెల్టర్ హోమ్‌లకు తరలించాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
వీధి కుక్కల బెడదపై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలు, బస్ స్టేషన్ల దగ్గర వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికార పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, క్రీడా సముదాయాల్లో ఉన్న కుక్కలను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించేందుకు కంచెలు ఉండేలా చూసుకోవాలని జిల్లా న్యాయాధికారులకు స్పష్టం చేసింది. పట్టుకున్న వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలి గానీ.. తిరిగి ఎక్కడ కూడా వదిలిపెట్టొద్దని జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత అధికారులకు ఆదేశించింది. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంగణాల్లో వీధి కుక్కలు లేవని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించింది.
ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఇండియన్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోసారి అదే రీతిలో అన్ని రాష్ట్రాలకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై జంతు ప్రేమికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

