CJI: గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు: లాయర్‌కు సీజేఐ వార్నింగ్

సుప్రీంకోర్టులో నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయవాది తీరుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. లాయర్ గట్టిగా మాట్లాడుతుండటంతో గొంతు తగ్గించాలని హెచ్చరించిన సీజేఐ.. కోర్టును బెదిరించాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడుతుండటంతో జస్టిస్ చంద్రచూడ్ ఇలా స్పందించారు.
‘ఒక్క సెకెను.. మీరు సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు.. మీరు ప్రతిసారీ న్యాయమూర్తులపై ఇదే తీరుగా అరుస్తారా? గొంతును పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా పదవి చివరి సంవత్సంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు.. గొంతు తగ్గించండి. దేశ అత్యున్నత కోర్టులో మీరు వాదించే విధానం ఇదేనా? మీరు గొంతు తగ్గించకుంటే కోర్టు నుంచి బయటకు పంపుతాను’ అని న్యాయవాదిపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సీజేఐకి క్షమాపణలు చెప్పిన ఆ న్యాయవాది.. ఇకపై అలా చేయబోనని అన్నారు. అయితే, సంయమనంతో వ్యవహరించాలని లాయర్లను సీజేఐ హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్ సింగ్ గతేడాది మార్చిలో ఇలాగే మాట్లాడటంతో తగ్గాలని సీజేఐ హెచ్చరించారు. ‘నిశ్శబ్దంగా ఉండండి.. ఇప్పుడే ఈ కోర్టును వదిలివెళ్లండి.. మీరు మమ్మల్ని భయపెట్టలేరు’ అని వార్నింగ్ ఇచ్చారు.
గతేడాది అక్టోబరులో ఓ న్యాయవాది కోర్టు హాలులో ఫోన్‌లో మాట్లాడటం చూసి సీజే తీవ్రంగా స్పందించారు. ఫోన్‌లో మాట్లాడుకోవడానికి ఇదేమైనా మార్కెట్టా అని వ్యాఖ్యానించారు. అప్పుడే న్యాయవాదుల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com