CJI Chandrachud : బుల్‌డోజర్‌తో న్యాయం చేయడం ఆమోదయోగ్యం కాదు..

CJI Chandrachud : బుల్‌డోజర్‌తో న్యాయం చేయడం ఆమోదయోగ్యం కాదు..
X
చివరి తీర్పులో సీజేఐ చంద్రచూడ్

దేశవ్యాప్తంగా ఇటీవల ‘బుల్డోజర్’ చర్యలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదివరకు నిర్మాణ రంగానికే పరిమితమైన ఈ సాధనం.. ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక ఆయుధంగా మారింది. బుల్డోజర్‌ న్యాయం పేరుతో పలు రాష్ట్రాలు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. కాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ఆయన నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ చర్యల ద్వారా పౌరుల గొంతు నొక్కడం సరైనది కాదని.. చట్టబద్ధమైన పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్‌ న్యాయం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని.. వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు ఉండదని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే.. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఇలాంటి చర్యలు చేపట్టడంలో తప్పు లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని సూచించారు.

బుల్డోజర్‌ న్యాయం పేరుతో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. యూపీలో తొలుత మొదలైన ఈ ధోరణి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకూ పాకింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే పలు మార్లు సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేస్తూ, అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది. అయితే, రహదారులు, ఫుట్‌పాత్‌ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపునిచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ ఆదివారం పదవీ విరమణ చేస్తారు. 2022 నవంబర్‌లో భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎన్నో ముఖ్యమైన కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 11న ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా 2025 మే 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

Tags

Next Story