Supreme Court CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, కేంద్రానికి చంద్రచూడ్ లేఖ
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చంద్రచూడ్ సిఫార్సులకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే.. సుప్రీంకోర్టు 51వ సీజేగా సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నానే.
సంప్రదాయం ప్రకారం.. సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా నామినేట్ చేస్తారు. ఈ ప్రకారం జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా సీనియర్‌గా ఉన్నారు. ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖకు పంపుతారు. ఆ లేఖను ప్రధానమంత్రి పరిశీలన కోసం కేంద్ర న్యాయ శాఖ పంపనుంది. పీఎం ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ డివై చంద్రచూడ్ 2022 నవంబర్ 9న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం వచ్చే నవంబరు 10తో ముగియనుంది. ఆ మరుసటి రోజు జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com