సోషల్ మీడియా పోస్ట్ లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్ట్ లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులంటూ అత్యున్నత న్యాయస్థానం నెటిజెన్లకు హెచ్చరికలు జారీచేసింది. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలంది సుప్రీంకోర్టు. తమ పోస్టులు ఎంత
దూరం వెళతాయో..? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని కామెంట్ చేసింది. 2018లో మహిళా జర్నలిస్టులపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ శేఖర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు రాగా, అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు చేపట్టింది.అయితే బీజేపీకి చెందిన శేఖర్ ఆ పోస్టును కొద్ది గంటల్లోనే తొలగించి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కేసులు కొనసాగడంతో వాటిని కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా, సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.
అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్థించింది. పోస్టు పెట్టిన రోజు శేఖర్ కంట్లో మందు వేసుకున్నారని,పోస్టు చేసిన కంటెంట్‌లోని ప్రతీ అంశాన్ని ఆయన క్షుణ్ణంగా చదవలేదని న్యాయవాది చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వాడేవారు తాము పోస్టు చేస్తున్న కంటెంట్ ఏంటనే స్పృహ కలిగి ఉండాలని సూచించింది. ఒక అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నపుడే దాని ద్వారా తలెత్తే విపరిణామాలకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా పోస్టు వదిలిన బాణంతో సమానమని, ఒకసారి పోస్టు చేశాక జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యం కాదని చెప్పింది.
ఇక ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 74 ప్రకారం ఎఫ్‌ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంటేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గాయపడిన వ్యక్తి నుంచి ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసిన వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలంగా పరిగణించవచ్చునని పేర్కొంది. జంట హత్యల కేసులో బిహార్‌కు చెందిన ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌ను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.అధికారులకు బాధ్యతలను నిర్దేశించిన సమాచార హక్కు చట్టంలోని సెక్షన్-4 సక్రమంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర సమాచార కమిషన్, అన్ని రాష్ట్రాల సమాచార కమిషన్లను సుప్రీంకోర్టు ఆదేశించింది.దేశంలో రోమియో-జూలియట్ చట్టాన్ని అమలు చేయవచ్చా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com