Baba Ramdev: ధిక్కరణ కేసును ముగించిన సుప్రీంకోర్టు

యోగా గురు రామ్‌దేవ్ బాబాకు భారీ ఊరట లభించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను రూపొందించారని పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ, యోగా గురు బాబా రామ్‌దేవ్‌లపై నమోదైన ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. ఈ ప్రకటనలకు సంబంధించి రామ్ దేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది.
కొవిడ్ వ్యాక్సినేషన్, అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రచారం చేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ, అమానుల్లాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పంతజలిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆరోపించిన తప్పుదోవ పట్టించే ప్రకటనలను పతంజలి ప్రింట్ మీడియాలో ప్రచురించింది. జనవరి 3, 2024న జరిగిన విచారణలో పతంజలిపై ధిక్కార చర్య తీసుకున్నందుకు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ధిక్కార నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో.. ఇద్దరిని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ క్షమాపణలు కోరారు. ఆ క్షమాపణలను కోర్టు తిరస్కరించింది. తప్పుడు ప్రకటనలపై క్షమాపణలు కోరుతూ పత్రికల్లో యాడ్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మళ్లీ 7న విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పతంజలిని మందలించింది. ఆ తర్వాత విచారణలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది. అనంతరం మే 14న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. నేడు తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యివహరిస్తామని ఈ సందర్భంగా న్యాయస్థానం హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com