Supreme Court : వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టే.. చివరి నిమిషంలో నిర్ణయం వాయిదా

Supreme Court : వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టే.. చివరి నిమిషంలో నిర్ణయం వాయిదా
X
దస్తావేజులు లేకుంటే వక్ఫ్‌ ఆస్తులు కాదంటారా?

వివాదాస్పద వక్ఫ్‌ సవరణ చట్టం-2025లోని పలు కీలక నిబంధనలపై స్టే విధింపునకు సుప్రీంకోర్టు బుధవారం ప్రతిపాదించింది. కోర్టులు ‘వక్ఫ్‌’గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు కల్పించే నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేస్తామని కోర్టు ప్రతిపాదించగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అటువంటి మధ్యంతర ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు వినాలని కోరింది. వక్ఫ్‌ సవరణ చట్టం 2025ని సవాలు చేస్తూ దాఖలైన 75 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. హిందూ మత ట్రస్టుల్లో ముస్లింలను కూడా భాగస్వాములుగా చేర్చుకోవడానికి అనుమతిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయరాదని, అవి వక్ఫ్‌బై యూజర్‌గా ఉన్నా వక్ఫ్‌ బై డీడ్‌(ఒప్పంద పత్రాలు)గా ఉన్న వాటిని డీనోటిఫై చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.‘ఎక్స్‌ అఫీషియో సభ్యులు మినహాయించి వక్ఫ్‌ బోర్డులు, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌కు చెందిన సభ్యులు అందరూ ముస్లింలు మాత్రమే ఉండాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తొలుత ఈ పిటిషన్లను హైకోర్టుకు నివేదించాలని భావించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చుకుని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ, రాజీవ్‌ ధావన్‌తోసహా పలువురు న్యాయవాదులు, కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ప్రస్తుతానికి లాంఛనంగా ఎటువంటి నోటీసు జారీచేయనప్పటికీ ఏప్రిల్‌ 17న(గురువారం) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పిటిషన్లపై విచారణను తిరిగి చేపడతామని ధర్మాసనం తెలియచేసింది.

హింసపై ధర్మాసనం ఆందోళన

వక్ఫ్‌ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలో జరుగుతున్న హింసాకాండ పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తాము విచారణకు స్వీకరించిన తరుణంలో ఈ హింస జరగడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా ఎక్స్‌ అఫిషియో సభ్యులను మతాలకు అతీతంగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చని, కాని ఇతరులు మాత్రం ముస్లింలు మాత్రమే ఉండాలని ఉత్తర్వులు జారీచేస్తామని సీజేఐ ప్రతిపాదించారు.

పత్రాలు లేనంత మాత్రాన..

వక్ఫ్‌గా చాలా ఆస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఉండకపోవచ్చని, అలాంటి పరిస్థితిలో వక్ఫ్‌ బై యూజర్‌ని ఎందుకు అనుమతించరని తుషార్‌ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. యజమాని వద్ద వక్ఫ్‌కు సంబంధించి లిఖితపూర్వక పత్రాలు ఉండనప్పటికీ వాటి దీర్ఘకాల ఉపయోగాన్ని పరిగణనలోకి తీసుకుని మతపరమైన లేదా చారిటబుల్‌ ఎండోమెంట్‌(వక్ఫ్‌)గా ఆ ఆస్తులను గుర్తించడాన్ని వక్ఫ్‌ బై యూజర్‌గా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ‘అటువంటి వక్ఫ్‌ బై యూజర్‌ను ఎలా రిజిస్టర్‌ చేస్తారు? వారి వద్ద ఏం డాక్యుమెంట్లు ఉంటాయి? ఇది మరొకందుకు దారితీయవచ్చు. కొంత దుర్వినియోగం జరగవచ్చు. కాని నిజమైనవి కూడా ఉంటాయి. వక్ఫ్‌ బై యూజర్‌ను గుర్తించినట్టు బ్రిటిష్‌ కాలం నాటి తీర్పులను నేను చదివాను. వక్ఫ్‌ బై యూజర్‌ను తొలగిస్తే అది సమస్యగా మారుతుంది. చట్టసభ ఏ తీర్పును, ఉత్తర్వును లేదా డిక్రీని గాలిలోకి ప్రకటించలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, వక్ఫ్‌ చట్టం తమకు వద్దని చాలా మంది ముస్లింలు కోరుకుంటున్నట్లు తుషార్‌ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. దీనికి ధర్మాసనం స్పందిసూ,్త‘హిందూ ధార్మిక బోర్డులలో భాగస్వాములుగా ముస్లింలను కూడా ఇప్పటి నుంచి అనుమతిస్తున్నామని మీరు చెబుతున్నారా? సూటిగా బయటకు చెప్పండి’ అంటూ మెహతాను ప్రశ్నించింది.

Tags

Next Story