Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ మీకేమైనా స్నేహితుడా..: న్యాయవాదిపై సుప్రీం ఫైర్

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తు నగదు కట్టలు లభ్యం అయిన విషయం అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను లాయర్ మాథ్యూస్ నేడుంపరా దాఖలు చేశారు. ఇది జస్టిస్ వర్మకు వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన మూడవ పిటిషన్ కావడం గమనార్హం.
ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరిపి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టాలని నేడుంపరా పట్టుబట్టగా.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జస్టిస్ యశ్వంత్ వర్మను.. వర్మ అని సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో సంభోదించడానికి ఆయన మీకేమైనా స్నేహితుడా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ వర్మపై ఆరోపణలు ఉన్నందున న్యాయమూర్తి స్థానానికి ఆయన అర్హుడు కాదని లాయర్ వాదించగా.. సర్వోన్నత న్యాయస్థానానికి పాఠాలు చెప్పొద్దంటూ ధర్మాసనం మండిపడింది.
అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానంపై 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారని ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్న విషయం తెలిసిందే. నేడు ప్రారంభం అయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ తీర్మానాన్ని తెస్తామన్నారు. జస్టిస్ వర్మను తొలగించే విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ వివాదం వెనుక ఒక అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఉంది. జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉన్న స్టోర్‌రూమ్‌లో పెద్ద మొత్తంలో సగం కాలిన నగదు లభ్యమైందని ఈ కమిటీ నివేదించింది. ఈ సంఘటన జస్టిస్ వర్మ అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించి, ఆయనను అభిశంసించాలని మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సిఫార్సు చేయడానికి దారితీసింది.
న్యాయమూర్తుల అంతర్గత విచారణ కమిటీ, ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు నేతృత్వంలో ఈ కేసును పరిశీలించింది. కమిటీ మొత్తంగా 55 మంది సాక్షులను విచారించడంతో పాటు జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడా సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ విచారణలో లభ్యమైన ఆధారాలను బట్టి కమిటీ తన నివేదికను సమర్పించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com