Supreme Court: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ

2020లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలతో నమోదైన కేసులో విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వీరిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, ఇదే కేసులో ఐదేళ్లకు పైగా జైలులో ఉన్న గల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్ సహా మరో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని, అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) సెక్షన్ 43D(5) కింద బెయిల్ మంజూరు చేయడానికి నిబంధనలు అంగీకరించవని ధర్మాసనం స్పష్టం చేసింది. అల్లర్ల ప్రణాళిక, జన సమీకరణ, వ్యూహాత్మక ఆదేశాలు ఇవ్వడంలో వీరిద్దరి పాత్ర ఉందని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొంది.
ఈ కేసులో నిందితులందరి పాత్ర ఒకే స్థాయిలో లేదని, కుట్రలో వారి భాగస్వామ్యాన్ని బట్టి ప్రతి దరఖాస్తును విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మిగతా నిందితులతో పోలిస్తే ఉమర్, షర్జీల్ పాత్ర భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది.
అంతకుముందు ఢిల్లీ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ అల్లర్లు ఆకస్మికంగా జరిగినవి కావని, దేశ సార్వభౌమత్వంపై జరిగిన ఒక ప్రణాళికాబద్ధమైన దాడి అని వాదించారు. విచారణ ఆలస్యానికి నిందితులే కారణమని, వారు సహకరించడం లేదని ఆరోపించారు. గతంలో 2025 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీ హైకోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

