Freebies: ఉచితాలిస్తే ప్రజలు పనిచేయరు! తాయిలాలపై సుప్రీంకోర్టు కీలక వాఖ్యలు

ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు మంచివి కానే కాదన్న ధర్మాసనం.. వీటి వల్ల ప్రజలు పనిచేయడానికి ఎంతమాత్రం ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ప్రజలను ఒకవిధంగా పరాన్నజీవులుగా మార్చడం లేదా? అంటూ రాజకీయ పార్టీలను సూటిగా ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ‘లడ్‌కీ బహిన్’ వంటి స్కీమ్‌ల ద్వారా డబ్బులు, ఫ్రీ రేషన్ పేరిట ఇంటికే ఆహార ధాన్యాలు ఇలా అన్నీ ప్రజలకు ఉచితంగానే అందుతున్నాయి. ఎలాంటి పనులు చేయకుండానే ఇవి వస్తుండటంతో ప్రజలు ఉచితాలకే అలవాటుపడిపోతున్నారు.
- ఉచిత పథకాలు మంచివి కానేకావు. దురదృష్టవశాత్తూ.. వీటి కారణంగా ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు.
- (పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తులు దేశంలో ఎవరూ ఉండరని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్న మాటలకు స్పందించిన ధర్మాసనంలోని ఓ జడ్జి..) ఈ విషయంలో మీకు ఒకవైపు మాత్రమే అవగాహన ఉందనుకొంటా.. నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్తా వినండి.. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించాయి. దీంతో పొలంలో పనిచేయడానికి కూలీలు కూడా ఎవరూ రాలేదు. ఇంటికే అన్నీ ఉచితంగా వస్తున్నప్పుడు పొలంలో పనిచేయడానికి ఎవరు ఇష్టపడుతారు? మీరే చెప్పండి??
- ఉచితాల పేరుతో ప్రజలను మనం (రాజకీయ పార్టీలు) ఒకవిధంగా పరాన్నజీవులుగా మార్చట్లేదా?
- ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే పద్ధతి ఎంతమాత్రం సరైనది కాదు.
- ఇక ఈ పిల్ విషయానికి వస్తే, ప్రజలకు ఆశ్రయం కల్పించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే కానీ, వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలి. అయితే, ఉచితాలతో అది జరుగట్లేదు. అంటూ పేర్కొన్న న్యాయస్థానం.. పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలంపాటు పనిచేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఉచితాలు.. అవినీతికి మార్గాలు!
ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీలు అవినీతికి మార్గాలుగా పరిణమిస్తున్నాయంటూ రిటైర్డ్ జడ్జి ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారించి ఉచిత హామీలన్నీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఉచితాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో టాప్ కోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌కు సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com