Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టు సీరియస్

ఇటీవల హైడ్రామా నడుమ జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలపై ఏదో రాసి వాటిని పాడు చేసినట్టు ఎన్నికల ప్రక్రియ వీడియోను చూస్తే స్పష్టమవుతున్నని పేర్కొన్నది. అత్యంత వివాదాస్పదమైన ఈ ఎన్నిక వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఘాటు విమర్శలు చేసింది. అదే తీవ్రతతో కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త మేయర్ సారథ్యంలో ఎలాంటి సమావేశాలను కూడా నిర్వహించకూడదంటూ తక్షణ ఆదేశాలను జారీ చేసింది.
ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం హత్యకు గురికావడాన్ని తాము ఎంతమాత్రం అనుమంతించబోమని స్పష్టం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరును సవాల్ చేస్తూ ఆప్ కౌన్సిలర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల సందర్భంగా తీసిన వీడియోను ఈ సందర్భంగా కోర్టు పరిశీలించింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 19న ప్రిసైడింగ్ అధికారి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చండీగఢ్ మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీచేసింది.
ఇటీవలే చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ సీనియర్ నేత మనోజ్ సోంకర్ చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కుల్‌దీప్ సింగ్‌ను మట్టికరిపించారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం సంఖ్యాబలం 35. కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో బీజేపీ-14, ఆమ్ ఆద్మీ పార్టీ-13, కాంగ్రెస్-7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడు ఉన్నారు. మేయర్ ఎన్నికలో బీజేపీ తరఫున మనోజ్ సోంకర్, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థిగా కుల్‌దీప్ సింగ్ పోటీ చేశారు. నిజానికి ఈ ఎన్నికలో సంఖ్యాపరంగా చూసుకుంటే ఆప్- కాంగ్రెస్ ఉమ్మడి కూటమి అభ్యర్థి విజయం సాధించాల్సి ఉంది. అలా జరగలేదు. పోలింగ్ సమయంలో బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు పడ్డాయి. కుల్‌దీప్ సింగ్‌కు 12 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెెస్-ఆప్‌కు చెందిన ఎనిమిది ఓట్లను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీ.. చెల్లనివిగా ప్రకటించారు. దీనితో 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలిచారు.
ఈ ఎన్నిక వ్యవహారంపై ఆప్- కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మేయర్ ఎన్నికలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తమకు ఉన్న సంఖ్యాబలం గురించి వివరించింది. ప్రత్యేకించి- తమ కూటమికి చెందిన కౌన్సిలర్లు వేసిన ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించడం సరికాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది.
ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, వీడియో రికార్డింగులను భద్రపరచాలని పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగలేదని భావిస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నెల 7న జరుగాల్సిన చండీగఢ్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆదేశించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో సరిగ్గా స్పందించలేదని, కేసు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com