Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్దమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వేరువేరు పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపి తీర్పును వెలువరించింది. తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపించారు. పిటీషనర్ల వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంటూ.. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం, కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సీజేఐ తెలిపారు. ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై రాష్ట్రపతి ప్రకటన చేశారని ధర్మాసనం గుర్తుచేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని, రాష్ట్రపతి ప్రకటనను కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది.

2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోరు్టు ఆదేశించింది. జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతండగా ఉన్న జమ్మూ కశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్దరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఇదిలావుంచితే, ఆర్టికల్ 370పై తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో కేంద్రం అలర్ట్ ప్రకటించింది. భద్రతాబలగాలతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. శాంతికి విఘాతం కలిగించే పనులను అడ్డుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలని బీజేపీ పిలుపునిచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

అయితే, కోర్టు తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని అబ్దుల్లాతో పాటు గుప్కార్ అలయెన్స్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ని సుప్రీంకోర్టు పునరుద్ధరిస్తుందని భావించారు. జమ్మూకశ్మీర్ లోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్ గా ఏర్పడి ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఆగస్టులో దాఖలైన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి తాజాగా తీర్పు వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story